శ్రీవారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అధికారులు
తిరుమల, జూలై 29 : తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఆదివారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులకు అర్చకులు స్థాపన తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ పవిత్రోత్సవాలలో దర్బతో తయారు చేసిన పవిత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుతగా తిరుమలలోని పాదాల మండపం వద్ద నున్న శ్రీవారి పాదాలకు అర్చకస్వాములు ఛత్రస్నపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీవారి దివినుండి భువికి వచ్చినప్పుడు తొలుతగా ఈ ప్రదేశంలోనే స్వామి పాదాలు మోపారని చరిత్ర తెలుపుతోంది. దీనిని పురస్కరించుకొని శ్రావణమాసంలో వచ్చే శ్రీవారి పవిత్రోత్సవాల్లో శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్నపనోత్సవాన్ని టిటిడి అధికారులు నిర్వహించడం అనవాయితీ. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు , ఇఓ ఎల్‌వి సుబ్రహ్మణ్యం, జెఇఓ శ్రీనివాసరాజు, ఆలయ భద్రతా అధికారి అశోక్‌కుమార్, ఆలయ ఓఎస్‌డి శేషాద్రి, అర్చకస్వాములు, వేలాది మంది భక్తులు రెండవనాటి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.