శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న ఏపీ మంత్రి శిద్దా
కర్నూలు,ఫిబ్రవరి17(జనంసాక్షి): మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని ఏపీ రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద
మంత్రికి అర్చకులు, వేదపండితులు, ఈవో సాగర్‌బాబు స్వాగతం పలికారు. స్వామివారికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భ్రమరాంభికాదేవి ఆశీర్వచన మండపంలో మంత్రి శిద్దాకు అర్చకులు, పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామి ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. పాదయాత్రగా వచ్చే భక్తులు పరమశివుడిని జపిస్తూ శ్రీశైలానికి చేరుకున్నారు. శ్రీగిరి కొండలన్నీ మల్లన్న భక్తులతో సందడిగా మారాయి. భక్తకోటి నడమ అఖండ బ్రహ్మాండనాయకుడి వేడుకలు అంబరాన్నంటాయి. సకల శుభాలు కలిగించే మల్లికార్జునస్వామి దర్శనంతో పునీతమయ్యేందుకు భక్తులు సకుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు భక్తి పారవశ్యంతో పాతాళగంగలో పుణ్యస్నానాలాచరిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించనున్నారు. మహానంది పుణ్యక్షేత్రం మహాశివరాత్రి బ్ర¬్మత్సవాలతో సందడిగా మారింది. వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వరస్వామి వార్లకు ఉదయం వాహన సేవలను భక్తిశ్రద్ధలతో చేయించారు. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి ఇక్కడి గుండంలో స్నానాలు చేసి దర్శనాలుచేసుకున్నారు. మహానంది పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి జాగరణ కార్యక్రమాలను దేవస్థానం నిర్వహిస్తోంది. రాత్రి భక్తుల వినోదానికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెల్లవారు జామున 2 గంటలకు కామేశ్వరీదేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. మహానందిలో 18వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగు బలప్రదర్శనలు ఖరారు కావడంతో క్షేత్రానికి చేరుకుంటున్నాయి. విద్యుత్తుకాంతులతో క్షేత్రంలోని గోపురాలు విరాజిల్లు తున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పత్తికొండ పట్టణంలోని బైపాస్రస్తాలోని శివాలయం, బండిగేరిలోని అతిపురాతన శివాలయం, తేరుబజారు కాశీ ఈశ్వర శివాలయం, మార్కండేయ స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారికి కల్యాణం, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఆలయాలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు.