శ్రీహరికోటకు సందర్శనకు భైంసా విద్యార్థులు

ఆదిలాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): భైంసా పట్టణంలోని ఓ పాఠశాల విద్యార్థులకు నెల్లూరులోని శ్రీహరికోటను సందర్శించే అవకాశం లభించింది. దీంతో ఇక్కడి విద్యార్థులు ఈ నెల 9న శ్రీహరికోటను సందర్శించనున్నారు. ఈనేపథ్యంలో భైంసా నుంచి 7,8,9 తరగతులకు చెందిన 65మంది విద్యార్థులతో శ్రీహరి కోట వెళ్లేందుకు బయలుదేరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 9న ఉదయం 9గంటలకు తమ కేంద్ర సందర్శనకు 65మంది విద్యార్థులను అనుమతించారు. దేశంలోనే మొట్టమొదటిసారి మన దేశంలోని అంతరిక్ష కేంద్రం సదర్శించేందుకు తమ పాఠశాలకు అవకాశం లభించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. డిసెంబరు నెలలో శ్రీహరికోటలోని సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం చంద్రయాన్‌ అంతరిక్షనౌకను పంపింపేందుకు సంసిద్ధం చేసింది. నాలుగు సంవత్సరాల నుంచి శ్రీహరికోట సతీష్‌ధావన్‌ అంతరిక్షకేంద్రం సందర్శనకు, పార్లమెంటు, శాసనసభ సమావేశాలను తిలకించేందుకు భైంసా పట్టణంలోని వేదం పాఠశాల యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు శ్రీహరికోట సతీష్‌ధావన్‌ కేంద్రం హెచ్‌డీ పీవో ఎస్‌ఎం పి.విశ్వనాథ్‌ స్పందిస్తూ పాఠశాల యాజమాన్యానికి లేఖ రాశారు.

విద్యార్థులకు ఉపన్యాస పోటీలు

దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కలాం గుణం ఎడ్యుకేషనల్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నారు. నిర్మల్‌ పట్టణంలోని తెలుగు, ఉర్దూ, ఆంగ్ల మాధ్యమాలకు చెందిన ఉన్నత పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల స్థాయిలో ఈ పోటీలను స్థానిక శాంతినగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలు- భవిష్యత్తులో విద్యా, వైజ్ఞానిక రంగాల ప్రభావం అనే అంశంపై ఉపన్యాసం, భారతదేశ స్వాతంత్య పోరాటంలో మహానీయుల ఆయా భాషల దినపత్రికలు వాటి పాత్ర, ప్రభావం అనే అంశంపై వ్యాసరచన పోటీలు ఉంటాయని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పోటీల్లో పాల్గొనాలని కోరారు.