షర్మిలకు తెలంగాణ సెగ

 

పాదయాత్రను అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు

జై తెలంగాణ అనాలని డిమాండ్‌

ప్రతిఘటించిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు

దొరికిన వారిని దొరికినట్లు చితకబాదిన నేతలు

మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 24 :వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ సెగ తగిలింది. శనివారం ఉదయం వడ్డేపల్లి మండలం శాంతినగర్‌ విూదుగా సాగుతున్న షర్మిల పాదయాత్రను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలంటూ డిమాండ్‌ చేశారు. వారిని వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులను చితకబాదారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

మూడ్రోజుల క్రితం షర్మిల పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. మొదట్లో ఆమె పాదయాత్రను అడ్డుకొని టీఆర్‌ఎస్‌ శ్రేణులు, టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు  శనివారం ఉదయం అడ్డుకున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌లో నల్లజెండాలతో నిరసన తెలిపాయి. తెలంగాణపై స్పష్టమైన వైఖరి తెలపాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పట్టుబట్టారు. షర్మిల జై తెలంగాణ అనాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీఆర్‌ఎస్‌ నేతలపై ముష్టిఘాతాలు కురిపించారు. వెంటపడి మరీ చితక్కొట్టారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని గమనించిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీలు ఝళిపించారు. వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఇదిలా ఉంటే, వైఎస్సార్‌ సీపీ దాడిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌వీ కార్యకర్తలు ఐజలోని ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. ఫ్యాక్షనిస్టుల దాడులు నశించాలంటూ నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. మరోవైపు, వైఎస్సార్‌ సీపీ దాడులను టీఆర్‌ఎస్‌, ఆ పార్టీ విద్యార్థి విభాగం తీవ్రంగా ఖండించింది. తెలంగాణ వాదులపై వైఎస్సార్‌ సీపీ గూండాలు చేసిన దాడిని తెలంగాణ వాదంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ అన్నారు. ఈ దాడితో షర్మిల, ఆమె పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. జగన్‌ వదిలిన బాణం అని చెప్పుకుంటున్న షర్మిల తెలంగాణలో పర్యటించాలంటే జై తెలంగాణ అనాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణకు అనుకూలమని వైఎస్సార్‌ సీపీ స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు