షేర్‌ అలీ నగర్‌ను సందర్శించిన డీఎంహెచ్‌వో, ఆర్డీవో

కోహెడ: కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి పంచాయితీ పరిధిలోని షేర్‌ అలీనగర్‌లో విషజ్వరాల బారినపడి వారంరోజుల్లో జాస్వీ (5), సమీరా (8) మృత్యువాత పడ్డారు. మరో 8మంది చిన్నారులు అస్వస్థతకు గరయ్యారు. దీంతో శనివారం కరీంనగర్‌ డీఎం హెచ్‌వో నాగేశ్వరరావు, ఆర్డీవో సంధ్యారాణిలు గ్రామాన్ని సందర్శించారు. జిల్లా కేంద్రం నుంచి పిల్లల వైద్యనిపుణుడు అజయ్‌కుమార్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ శ్రావణ్‌లు ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 41 మంది చిన్నారులు ఉండగా 16 మందికి వైరల్‌ ఫీవర్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. అందులో 8మందికి మెరుగైన చికిత్స కోసం 108 ద్వారా జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత లేకపోవడం వల్ల వ్యాధులు ప్రబలినట్లు వైద్యులు తెలిపారు.