సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా

 ఉచితాలపై బహిరంగ చర్చకు సిద్ధమా…
-తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ
హుజూర్ నగర్ సెప్టెంబర్ 2(జనంసాక్షి):  పేదల కనీస  అవసరాలు తీర్చే సంక్షేమ పథకాలు ఉచితాలు అవుతాయా అని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. శుక్రవారం హుజూర్ నగర్ పట్టణంలోని లక్ష్మీనరసింహా ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రైతు సంఘం మహాసభల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్య పద్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఉచితాలు అంటూ వినూత్న ప్రచారం మొదలుపెట్టాడు అన్నారు. అదే విషయంపై సుప్రీంకోర్టు కూడా త్రిసభ్య కమిటీ నియమించి రాజకీయ పక్షాలను  సంప్రదించాలని కోరడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు పేర్కొన్నా ఉచితాలలో మధ్యాహ్న భోజనం, గ్రామీణ ఉపాధి హామీ పథకం,  కనీస విద్య, వైద్యం, ఆరోగ్యం, కరెంటు లాంటి అంశాలు ఉన్నాయన్నారు. పేద ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన అంశాలను  ఉచిత సంక్షేమ పథకాలలో చేర్చడం విచారకరమన్నారు. ఆహార కొరత విషయంపై 116దేశాలకు సంబంధించి సర్వే జరిపితే భారతదేశం  101వ స్థానంలో ఉందని వారి పిల్లలకు మధ్యాహ్నం భోజనం కల్పించడం కూడా సంక్షేమం కిందికి వస్తుందా అన్నారు. అది కూడా ఉచితమేనా అన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఉపాధి కల్పించి ఉపాధి హామీ కూడా సంక్షేమమే అయితే లక్షలాది కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రద్దు చెయ్యడం, కార్పోరేట్ శక్తులకు మేలు జరిగేలా సంపద పన్ను తగ్గించడం దేనికిందికి వస్తుందని ప్రశ్నించారు. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రజల కనీస అవసరాలు ఉచితాలు అంటూ ప్రచారం చేస్తున్న ప్రధాని మోదీ ఆయన అనుచరగణం ఆరెస్సెస్ లాంటి సంస్థలు సమాధానం చెప్పాలన్నారు. దేశంలో పన్నులు కడుతున్నది మధ్యతరగతి, దిగువతరగతి అన్న విషయం మరువరాదని హెచ్చరించారు. బ్యాంకు రుణాల రద్దు, రాయితీలు, సంపద పన్ను తగ్గింపు తదితర అంశాలను కూడా సుప్రీం కోర్టులో విచారించాలని తెలిపారు. పేదల కనీస అవసరాలు తీర్చే పథకాలను నిలిపివేస్తే తగిన బుద్ధి చెప్పేలా ప్రజాఉద్యమం నిర్మిస్తామన్నారు. సమాఖ్య వ్యవస్థలో రాష్ర్టాలు ప్రజల అవసరాలు తీరేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తే కేంద్రానికి వచ్చిన నష్టం ఏమిటన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గన్న చంద్రశేఖర్, ఎం వెంకటేశ్వర్లు, దొడ్డ నారాయణరావు, బెజవాడ వెంకటేశ్వర్లు, కంబాల శ్రీనివాస్, దొడ్డ వెంకటయ్య, కొప్పోజు సూర్యనారాయణ, పాలకూరి బాబు, గుండు వెంకటేశ్వర్లు, జడ శ్రీనివాస్, జక్కుల రమేష్, ఎల్లావుల రాములు, ఉస్తెల నారాయణరెడ్డి, దేవరం మల్లేశ్వరి, పోకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.