సంక్షేమ పథకాల్లో కెసిఆర్ నంబర్ వన్
ఉమ్మడిగా జతకట్టినా ఓడించడం కష్టం అన్న భావనలో ప్రజలు
కాంగ్రెస్‌కు నాయకత్వ లోపమే అసలు సమస్య
హైదరాబాద్,సెప్టెంబర్10(జనంసాక్షి): సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అన్న నిర్బీతిలో సిఎం కెసిరా/- ఉన్నారు. అవే రేపటి ఓటుబ్యాంక్ కానున్నాయన్న ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు. అధికారంలోకి రావడానికై ముందస్తు ఎన్నికలకు లైన్ క్లియర్ చేయించుకోవడంతో పాటు కేంద్రం నుంచి కావలసిన పనులు చేయించుకున్నారు. ప్రజలకు లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వచ్చారు. దీంతో సామాన్య ఓటర్లలో ఆయనపై సానుకూల అభిప్రాయమే ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన మాస్టర్ ప్లాన్ ప్రభావం జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీపై పడే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి పట్ల అంతులేని ఆగ్రహం ఉందని అంతా భావిస్తున్నారు. అంతమాత్రాన ప్రజలలో కూడా ఆయనపై అంతే కోపం ఉంటుందనుకోవడం భ్రమే అవుతుంది. కేసీఆర్ అనుసరిస్తున్న అహంకార పోకడలే తమను అధికారంలోకి తెస్తాయని కాంగ్రెస్ నాయకులు భ్రమిస్తున్నారు. తనలోని బలహీనత ఏమిటో బాగా తెలిసిన కేసీఆర్, అందుకు విరుగుడుగా రాజకీయ వ్యూహరచన చేస్తుంటారు. అందుకే ఆయన అడుగులను, ఆలోచనలను, వ్యూహాలను ప్రత్యర్థులు పసిగట్టలేని పరిస్థితి. శాసనసభ రద్దు తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించిన వెంటనే గవర్నర్ ఆమోదం పొందడం, గెజిట్ వెలువడటం, కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం వెళ్లిపోవడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అంతే వేగంగా స్పందిస్తూ రాష్ట్రానికి బృందాన్ని పంపుతోంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే నాలుగు రాష్ట్రాల కంటే ముందే నవంబరులో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశముంది. తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే దాని ప్రభావం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుంది. ఇది బిజెపికి బాగా కలసివచ్చే ప్రచారాశం. ప్రధాని మోడీ కూడా ఇదే కోరుకుంటున్నారు. వాస్తవాలు గుర్తించడంలో విఫలమైన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కెసిఆర్ హఠావో నినాదంతో ముందుకు పోవాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో బలమైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. రానున్న ఎన్నికలలో విజయాన్ని అందుకోవ డానికి ఇదొక్కటే నినాదం కాబోతున్నది. దీంతో ప్రతిపక్షాలను కలుపుకుని పోవడం కోసం ఎత్తులు వేస్తున్నారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం, టీఆర్‌ఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేసి కూడా విజయం సాధించలేదు. ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తమను నమ్మించి మోసం చేసిందన్న కోపాన్ని కేసీఆర్ ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వైఎస్ లాగేనే కెసిఆర్‌ను ఓడించలేమన్న భావన ప్రజల్లో కూడా ఉంది. దీంతో రాకీయంగా కెసిఆర్ బలంగా ఉన్నారన్న ప్రచారమే రేపటి విజయానికి నాంది కబోతున్నది.