సంక్షోభంలో వ్యవసాయ రంగం
కౌలు రైతులను నట్టేట ముంచుతున్న విధానాలు
ఏలూరు,జూన్20(జనం సాక్షి): దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 కౌలు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రైతుసంఘం నాయకులు డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత పథకాలు అమలు చేయాలని కోరారు. పెద్దనోట్ల రద్దుతో రైతులు, వ్యవసాయకూలీలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. చంద్రబాబు నిర్ణయాలతో వ్యవసాయ రంగం పరిస్థితి మరింత దిగజారిందన్నారు. వ్యవసాయరంగాన్ని రక్షించుకునేందుకు రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హావిూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో భూతాపం పెరిగిపోయి వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నదన్నారు. వ్యవసాయరంగంపై అధ్యయనం చేసేందుకు 52 కమిషన్లు వేశారని, ఒక్క కమిటీ సిఫారసు కూడా అమలు చేయలేదని తెలిపారు. ఆర్థిక సంస్కరణల కారణంగా దేశంలో వ్యవసాయ రంగం కుదేలైందన్నారు. 1995 తర్వాత దిగుమతి అవుతున్న వస్తువుల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. తొలుత 1420 రకాల వస్తువులు దిగుమతి అయ్యేవని, ఇప్పుడు ఆ సంఖ్య 2800కి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వదేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులను కూడా దిగుమతి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయని వివరించారు. చంద్రబాబు హయాంలో నీటి తీరువా వసూలు చేసే పద్ధతి ప్రవేశపెట్టారని అన్నారు. తెలిపారు. విద్యుత్ ఛార్జీలు వసూలు చేయడం,మార్కెట్ నియంత్రణ లేకపోవడం వంటివి ఆయన హయాంలోనే చోటు చేసుకున్నాయన్నారు.