సంస్కరణల పేరుతో పన్నుల భారం

ప్రజల సంక్షేమంలో తీరని నిర్లక్ష్యం
అనంతపురం,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు సంస్కరణల అమలులో
భాగంగా పేద ప్రజలపై పన్నుల భారం మోపి, పేదల నడ్డి విరుస్తున్నాయని పలు ప్రజా సంఘాలు విమర్శించారు. స్థానిక సంస్థలు విధించాల్సిన పన్నులను ప్రభుత్వాలు విధించడం చట్టవిరుద్ధమన్నారు. నీటి, చెత్త పన్నులు పెంచుతూ వీధి కొళాయిలను తీసివేస్తున్నారని, చెత్తను తొలగించేందుకు ప్రయివేటు కంపెనీలకు అప్పజెప్పుతున్నారని, దీని కారణంగా పేదలపై భారం పడుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా
అన్ని వర్గాలను కలుపుకొని ఉద్యమాలు చేస్తామన్నారు. ప్రపంచ బ్యాంకు నుండి అప్పులు పొందడం కోసం వారి ఒత్తిడి మేరకు ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారని తెలిపారు.  పంచాయతీ పాలకులు అరకొరగా సిమెంటు రోడ్లపై చెత్తను ఊడ్పించేసి అభివృద్ధి పనులకు వెచ్చించాల్సిన నిధులను తాము ఊడ్చుకుంటుంటారు.  పంచాయతీ పరిధిలో మంజూరైన నిధులతో చేబట్టిన అభివృద్ధి పనులకన్నా ఆ నిధులను పాలకుల సొంత అభివృద్ధికే ఎక్కువ వెచ్చించుకున్నట్లు పంచాయతీలోని గ్రామాలను పరిశీలిస్తే ఎవ్వరికైనా అనుమానాలు రాక మానవు. ఇందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో సహకరించినట్లు ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పంచాయతీ పరిధిలో అభివృద్ధి అంటే గ్రామాల ప్రజలకు నీటి సరఫరాలో లోటు చేయకుండా చర్యలు చేబట్టడం, ప్రతి గ్రామంలోనూ రాత్రివేళల్లో విద్యుత్‌ స్తంభాలకు బల్బులు వుండే విధంగా చూసుకోవడం. అన్ని చోట్లా ప్రజలు వీటినే ఆశిస్తారు. పంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులు పెద్ద ఎత్తున మంజూరైనప్పటికి ఎవ్వరు కూడా పాలకుల్నిగానీ, అధికారుల్ని గాని ప్రశ్నించరు. గ్రామంలోని చేతి పంపులో నీళ్ళు రావడం లేదని మండల పరిషత్‌ కార్యాలయంలోని అధికారుల దృష్టికి తీసుకెళ్తే పైపులు తక్కువ పడ్డాయని పైపులు వేయడానికి బిల్లులు మంజూరు కావాలంటే సుమారు రెండు మాసాలు పడుతుండటంతో మేమేం చేయలేమని అధికారులు మాట దాట వేస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీలో నిధులున్నప్పటికి వాటి వినియోగం కోసం మంజూరు చేయాలంటే జిల్లా కలెక్టర్‌ అనుమతి అవసరమని అధికారులు తెలిపారు. కలెక్టర్‌ గ్రామాలకు అవసరమైన
నీటి సరఫరా విషయంలో నిధులను మంజూరు చేసే విషయంలో జాప్యం చేయకుండా వెటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.  ప్రస్తుతం కానరాని వర్షాల కారణంగా ప్రతి గ్రామంలోని చేతిపంపులు, బోర్లలోని నీళ్ళు అడుగంటి ప్రజలు నీళ్ళ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ముఖ్యంగా చాలా బోర్లల్లో నీళ్ళు కొంచెం అడుగంటిన విషయం వాస్తవమైనా కూడా ఆ నీళ్ళు అందడానికి అవసరమైన పైపులు బోర్లల్లో కనిపించడం లేదు.