సచివాలయం విూకు శ్మశానంలా కనిపిస్తోందా?

– బొత్సపై మండిపడ్డ యనమల
అమరావతి, నవంబర్‌26  ( జనం సాక్షి ) : ప్రజా దేవాలయాలైన శాసన సభ, హైకోర్టులు శ్మశానాల్లా కనిపిస్తున్నాయా అంటూ మంత్రి బొత్స వ్యాఖ్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు  ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. మంత్రి బొత్సను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా దేవాలయాలైన శాసన సభ, హైకోర్టులను శ్మశానాలతో పోల్చుతారా అంటూ మండిపడ్డారు. వైకాపా నాయకులకు సచివాలయం శ్మశానంలా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. రాజధానికోసం 34వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేయడం సబబు కాదన్నారు. బొత్సపై చర్యలు తీసుకోకపోతే.. ఆయన వ్యాఖ్యల వెనక జగన్‌ ప్రోద్బలం ఉన్నట్లేనని యనమల ఆరోపించారు. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తామని ఆయన అన్నారు. రాజధాని ప్రజలనే కాదు, యావత్‌ రాష్ట్ర ప్రజలను మంత్రి బొత్స అవమానించారని యనమల దుయ్యబట్టారు.