సడలని పట్టుసడలని పట్టు

– ఆరో రోజుకు చేరిన నిరాహార దీక్ష
– క్షీణిస్తున్న సీఎం రమేశ్‌, బీటెక్‌ రవి ఆరోగ్యం
– దీక్షస్థలి వద్దకు భారీగా తరలివస్తున్న ప్రజలు
– రమేష్‌, రవిల ఆరోగ్యం కుదటపడాలని తెదేపా కార్యకర్తల పూజలు
– రమేష్‌, రవిల ఆరోగ్యం గవర్నర్‌ ఆరా
కడప, జూన్‌25(జ‌నం సాక్షి ) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సోమవారంతో  ఆరో రోజుకు చేరుకుంది. పలు దఫాలుగా వీరికి పరీక్షలు చేస్తున్న వైద్యులు ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని చెప్పినా.. దీక్ష విరమించడానికి ఇద్దరు నేతలు ససేమిరా అంటున్నారు. ఆరోరోజు దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఎక్సైజ్‌ శాఖ మంత్రి జవహర్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ తెదేపా కార్యకర్తలు దేవుని కడపలో ప్రత్యేక పూజలు చేశారు. తమ ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని తెలుస్తోందని… అయినా ఆశయం నెరవేరకుండా దీక్ష విరమిస్తే ఎలా అని బీటెక్‌ రవి ప్రశ్నించారు.  కేంద్రం ప్రకటన చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
సీఎం చంద్రబాబుకు గవర్నర్‌ ఫోన్‌..
కడప ఉక్కు పరిశ్రమ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్యంపై గవర్నర్‌ నరసింహన్‌ ఆందోళన వ్యక్తం చేశారు.  సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుకు గవర్నర్‌ నరసింహన్‌ ఫోన్‌ చేసి సీఎం రమేష్‌, బీటెక్‌ రవి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఎం రమేష్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని సమాచారం వచ్చిందని, ఆరోగ్య పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్‌ సూచించారు.
గాలి కోసమే స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వడం లేదా? –  మంత్రి అమర్‌నాథ్‌
బీజేపీ, వైసీపీలు గాలి జనార్దన్‌రెడ్డితో కలిసి నాటకాలు ఆడుతున్నాయని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. కడపలో ప్రైవేట్‌ సంస్థలు పరిశ్రమలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, అయితే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందని మంత్రి పేర్కొన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్‌ ఆమరణ దీక్ష చేస్తుంటే కేంద్రం నుంచి స్పందన లేదని మండిపడ్డారు. గాలి జనార్దన్‌ రెడ్డి కోసమే స్టీల్‌ ప్లాంట్‌ ఇవ్వడం లేదా? అని మంత్రి అమరనాథరెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికైన కేంద్రం దిగొచ్చి కడపలో స్టీల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.