సత్వరమే పరిష్కరించండి
కరీంనగర్, జూలై 23: ప్రజావాణిలో ప్రజల నుండి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిచ్చి సత్వరం పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చేయాలని కోరారు. ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తమ సమస్యల పరిష్కారంకు జిల్లాకేంద్రానికి వస్తారని అన్నారు. ప్రజావాణిలో ఇప్పటివరకు 69247 అర్జీలు రాగా అందులో 66064 ఫిర్యాదులకు పరిష్కరించిచట్లు ఆయన వెల్లడించారు. 3183 పెండింగ్‌లోనున్నట్లు తెలిపారు. 465 అర్జీలు 30 రోజులుగా పెండింగ్‌లోనున్నట్లు, ఆయన అన్నారు. 30 రోజులకన్నా ఎట్టి పరిస్థితిల్లో పెండింగ్‌లో ఉండరాదని, అట్టి సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో వర్షాలు కూరుస్తున్నందున రైతులకు ఎరువుల పంపిణీ ఇబ్బంది లేకుండా పర్యవేక్షించాలన్నారు. ఎరువుల సంబంధించి స్టాక్ కొరత లేదని, ప్రైవేటు డాలర్ల దగ్గర, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా ఎరువులు రైతులకు ఇబ్బంది లేకుండా మండల స్పెషల్ ఆఫీసర్లు వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు జెసి సుందర్ అబ్నార్, డిఆర్‌ఓ పిచిఆర్ ప్రసాద్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.