సద్దుమణిగిన పెసర్ల కొనుగోలు వ్యవహారం

గందరగోళానికి తావు లేకుండా చర్యలు

బ్రోకర్లను ప్రోత్సహించడంతోనే రైతులకు అన్యాయం

సంగారెడ్డి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): జహీరాబాద్‌ మార్కెట్లో పెసర్ల కొనుగోలు వ్యవహారం సద్దు మణిగింది. రైతుల నుంచి కొనుగోళ్లు సాఫీగా సాగాయి. ఎలాంటి గందరగోళం లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం మొత్తం కొనడంతోపాటు ఇచ్చిన గడువు వరకు కేంద్రాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ పెసర రైతులు రోడ్డడెక్కారు. జహీరాబాద్‌లో జాతీయ రహదారిపై బైఠాయించారు. ఇంకా అయిదే వేలకు పైగా బస్తాలు ఉండగానే కొనుగోళ్లు నిలిపి వేయడంతో ఆగ్రహించిన రైతులు శనివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. స్పందించిన అధికారులు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాలన్నీ తీసుకుంటామని హావిూ ఇచ్చినా మధ్యలోనే చేతులెత్తేశారు. దీంతో వందలాది మంది అన్నదాతల బస్తాలు మిగిలిపోగా, ఇరవై రోజుల క్రితం అనుమతులు పొందిన వారు సైతం బస్తాలు తీసుకురావటంతో సోమవారం ఉదయానికి మళ్లీ అయిదు వేల పైచిలుకు(2,500 క్వింటాళ్లు) బస్తాలు వచ్చాయి. కేంద్రాన్ని మూసివేశామని, కొనేది లేదని అధికారులు చెప్పటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని భవానీ మందిర్‌ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. స్థానిక ఎస్‌ఐ.సత్యనారాయణ అక్కడికి చేరుకొని సర్దిచెప్పినా వినిపించుకోకుండా చాలాసేపటి వరకు అక్కడే బైఠాయించారు. దాంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచి పోయాయి. వారికి మాజీ ఎమ్మెల్యే గీతారెడ్డి మద్దతు తెలుపుతూ 90 రోజులు నడవాల్సిన కొనుగోలు కేంద్రం నెల రోజులు కాకుండానే మూసేయటమేమిటని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌ నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్డీఓ అబ్దుల్‌ హవిూద్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం జ్యోతి, మార్కెట్‌ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి ఎం.దామోదర్‌, ఇప్పెపల్లి సహకార సంఘం అధ్యక్షుడు సంజీవరెడ్డి అక్కడికి చేరుకుని రైతులతో చర్చించారు. ఒక్కొక్కరి వద్ద పది క్వింటాళ్లు కొనుగోలు చేసేందుకు అంగీకరించడంతో శాంతించారు. రైతులతో పాటే వారంతా ¬తి(కే) శివారులోని కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని తూకాలు ప్రారంభించారు. గొడవలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే జహీరాబాద్‌ మార్కెట్‌ యార్డులో పెసర్ల కొనుగోలు కేంద్రం దగ్గర గోదాం దగ్గర పెసర్ల రైతుల నుంచి కాకుండా ఏజెంట్లు బ్రోకర్లు బినావిూ రైతుల పేరుతో కొంటున్నారని రైతులు అన్నారు. బ్రోకర్లు రైతుల ముసుగులో అమ్ముతూ ప్రభుత్వం మద్దతు ధర పొందుతున్నారని మండిపడ్డారు. మార్కెట్‌ యార్డ్‌ దగ్గరికి 6 రోజుల నుంచి పెసర్లు తీసుకొనివచ్చి గోదాం దగ్గర పడిగాపులు కాస్తున్న రైతులను కాదని బ్రోకర్లను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల తీరుకు నిరసనగా రైతులు65వ జాతీయ రహదారిపై అంబెడ్కర్‌ చౌరస్తా దగ్గర ఐదు గంటల పాటు రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేశారు బ్రోకర్లు ఏజెంట్లు వద్దగల ధాన్యాన్ని మార్కెట్‌ గోదాం దగ్గర తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు. కానీ సన్న సన్న చిన్నకారు రైతుల దాన్ని కొనుగోలు చేయలేదని రైతులు మండిపడ్డారు.