సన్నరకాలతో మోసపోయిన రైతులు
వారిని వెంటనే ఆదుకోవాలి: సీతక్క
వరంగల్,అక్టోబర్27(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. నిర్బంధంగా సన్నరకం వరిని సాగు చేయించడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. కొన్నిచోట్ల దోమపోటుతో దెబ్బతిన్న వరికి నిప్పు పెట్టుకున్న ఘటనలు చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల వరి పంట సాగులో ప్రభుత్వం బలవంతంగా 30 లక్షల వరకు సన్నరకం వడ్లను సాగు చేయించిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా భూసార పరీక్షలు నిర్వహించకుండ నిర్బంధంగా సన్నరకం వరి సాగు చేయించారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన ఫాంహౌస్‌లో భూసార పరీక్షలు నిర్వహించి, అక్కడి కలెక్టర్ సూచనల మేరకు దొడ్డు వడ్లు పండించారని అన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరితో ఈ రోజు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని, ఇప్పటికైన ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తామని, రైతులను ఆదుకుంటామని అన్నారు.