‘సబ్‌ప్లాన్’ సదస్సుల్లో ఖాళీ బిందెలతో నిరసన
హుస్నాబాద్ రూరల్, ఏప్రిల్ 14(జనంసాక్షి): హుస్నాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఎస్పీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అవగాహన సదస్సులు నిర్వహించేందుకు వచ్చిన హుస్నాబాద్ ఎమ్మెల్యే అల్గిడ్డి ప్రవీణ్‌రెడ్డి, మండల అధికారులకు శనివారం మహిళలు నిరసనలతో స్వాగతం పలికారు. మండలంలోని చౌటపల్లి, తోటపల్లి, జనగాం, అంతకపేట, అక్కన్నపేట గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో సదస్సులకు వచ్చిన మహిళలు తమకు ముందు తాగునీటి గురించి చెప్పాలని, గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నామని అధికారులను నిలదీశారు. నీటికోసం లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పడం తప్ప తమకు నీళ్లు మాత్రం రావడం లేదని ఎమ్మెల్యేతో గోడు వెల్లబోసుకున్నారు. అంతకపేట గ్రామంలో ఏకంగా ఖాళీ బిందెలు పట్టుకొని మహిళలు సదస్సుకు వచ్చారు. ఖాళీ బిందెలతో సదస్సులో కూర్చున్న మహిళలను అధికారులు వెనుకకు పంపించారు. అంతకపేట గ్రామంలోని ఒకటి, రెండు, మూడు వార్డులతో పాటు 10వ వార్డు, ఎస్సీకాలనీ, కట్కూర్ క్రాసింగ్ కాలనీలో 20 రోజులకు ఒకసారి నీళ్లొస్తున్నాయని మహిళలు చెప్పడంతో ఈ సమస్యపై విచారణ జరిపి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీరందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. అలాగే అక్కన్నపేట, హేమానాయక్‌తండాలో మహిళలు ఎమ్మెల్యే వాహనాన్ని ఖాళీబిందెలతో అడ్డుకొని నిరసన తెలిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అవగాహన కోసం వచ్చిన ఎమ్మెల్యేతో అధిక శాతం గ్రామాల ప్రజలు కేవలం తాగునీటి కోసం నిరసన తెలపడంతో హుస్నాబాద్ మండలంలో తాగునీటి ఎద్దడి ఎంతవరకు ఉందో అధికారులకు అర్థం కావాలని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు.