సమస్యలకు సమాధానం ఇస్తాం: పోచారం
నిజామాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): ప్రాజెక్టులు, వ్యవసాయానికి సంబంధించి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఇందులో దాపరికానికి తావు లేదన్నారు. రైతాంగ సమస్యలను చిత్తశుద్దితో పరిష్కరిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరగని ఎన్నో మంచి పనులు చేసి వ్యవసాయాన్ని పండగచేసి చూపుతున్నామని అన్నారు. అసెంబ్లీలో విపక్షాలు సమస్యలపై నిలదీస్తే సమాధానం చెబుతామని అన్నారు. కాంగ్రెస్ నాయకులు పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు రాజకీయం కోసం పాదయాత్రలు చేయడం సరికాదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే సరైన పరిపాలన చేసి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇన్నీ ఆత్మహత్యలు ఉండేవి కావన్నారు. భాజపా, తెదేపా, కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. ఇదిలావుంటే మరో రెండేళ్లలో కాళేశ్వరం నీరు నిజాంసాగర్‌కు తీసుకొచ్చి జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆయకట్టుతో పాటు అదనంగా 4.50 లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. మల్లన్న సాగర్ పూర్తయితే నిజామాబాద్ జిల్లాకు మేలు జరగుతుందని అన్నారు. కాళేశ్వరం నీటితో జిల్లాలో రెండు పటలకు సరిపడా నీరు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు 42 కిలోవిూటర్ల పొడవునా రూ. 10 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి ఇప్పటికే సొరంగ మార్గాలు తవ్వకాలు సగానికి సగం పూర్తయ్యాయన్నారు. మల్లన్నసాగర్ విషయంలో కాంగ్రెస్ అనేక కుట్రలు చేసి అడ్డుపడిన విషయాన్ని ప్రజలు గమనించారన్నారు. ఇంకా అడ్డుపడాలని చూస్తోందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ఉద్యానశాఖ ద్వారా 75 శాతం రాయితీ ఇస్తుందని అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కోరారు. ప్రతి ఏటా వెయ్యి ఎకరాల్లో ఉద్యాన పంటల ద్వారా రైతులు ఆదాయం పొందడానికి రూ.250 కోట్ల రాయితీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు కూడా ముందుకొచ్చి ఈ పంటలను పండించి అధిక అదాయం పొందాలన్నారు.