సమస్యలపై నిరంతర పోరాటం : కాంగ్రెస్
నిజామాబాద్,అక్టోబర్24(జనంసాక్షి): రైతుల సమస్యలతో పాటు, ఫీజు రియంబర్స్‌మెంట్ తదితర సమస్యలపై కాంగ్రెస్ పోరాడుతుందని డిసిసి అధ్యక్షుడు తాహిర్‌బిన్ అన్నారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిపై కేసులతో బెదరింపులకు పాల్పడుతున్నారని మండపడ్డారు. మాజీమంత్రి శ్రీధర్‌బాబుపై కేసు ఇందులో భాగమేనని అన్నారు. జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని కేసీఆర్ ఆలోచించి సాధ్యం కాకపోవడంతోనే మళ్లీ దానిని పునర్‌వ్యవస్థీకరించనున్నారని ఆరోపించారు. కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటం చేయాలన్నారు.తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ రెయాన్ మిల్స్, నిజాంషుగర్స్ కర్మాగారాలను మూతపెట్టారని విమర్శించారు. కొత్త పరిశ్రమలపై ఊదరగొడుతున్న వారు ముందుగా ఉన్నవాటిని కొనసాగించేలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలపై సీఎం కేసీఆర్ దండయాత్ర సాగిస్తున్నారని, భ్రమలు, భ్రాంతులతో లాలూచీ పెడుతున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆగడాలకు ప్రజాశక్తితో గుణపాఠం చెబుతామన్నారు. నిజాంషుగర్స్ కోసం కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు. ప్రజలను ముఖ్యంగా రైతులను సమాయత్తం చేయగలిగామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని టిఆర్‌ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హావిూ నెరవేర్చలేక పోయిందన్నారు. మూడున్నరేళ్లయినా ఈ ప్రాంత రైతులకు మేలు చేకూరలేదన్న విషయం గమనించారని అన్నారు. దీనిపై మాట్లాడితే మంత్రి పోచారం, ఎంపి కవితలు ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. 2019లో ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, తామే నిజాంషుగర్స్‌ను ప్రారంభిస్తామన్నారు. నిజాంషుగర్స్‌ను టీఆర్‌ఎస్ అమ్మే కుట్ర చేస్తోందని, అందుకే కర్మాగారాన్ని లేఆఫ్ పేరిట మూసేశారని ఆరోపించారు. మంత్రి పోచారం దీనిపై కప్పదాటు సమాధానాలతో దాటవేస్తున్నారని అన్నారు. ప్రజల సొమ్ముతో సీఎం కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కవిత విలాసాలు చేస్తున్నారని ఆగ్రహం
వ్యక్తం చేశారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద చక్కెర కర్మాగారంగా గుర్తింపు పొంది వేలాది మంది చెరుకు రైతులు, వేలాది కార్మికులు ఆధారపడ్డ కర్మాగారాన్ని మూతపెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. వాటర్‌గ్రిడ్, ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు కోట్ల రూపాయలిస్తున్న ప్రభుత్వానికి రైతులకు ఇచ్చే ధైర్యం ఎందుకు చేయడం లేదన్నారు. ఫీజు రీయింబర్‌మెంట్ పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. లిక్కర్ అమ్మకాల్లో నెంబర్ వన్‌గా నిలవడం రాష్ట్రం సాధించిన ఏకైక అభివృద్ధి అని తాహిర్ ఎద్దేవా చేశారు.