సమస్యలపై సమరం చేస్తా….
-బీజేపీ అభ్యర్ధి హుస్సేన్‌నాయక్ విస్తృత ప్రచారం
మహబూబాబాద్, నవంబర్ 25(జనంసాక్షి):
మానుకోట నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై సమరం చేస్తానని బీజేపీ అభ్యర్ధి జాటోత్ హుస్సేన్‌నాయక్ శపథం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 1, 4, 5, 6, 7, 28వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అంతేగాక కేసముద్రం మండలానికి చెందిన టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు సమ్మిగౌడ్‌తో పాటు కార్యకర్తలు భారీ సంఖ్యలో హుస్సేన్‌నాయక్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌నాయక్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని మానుకోట మునిసిపాలిటీ, కేసముద్రం గ్రామ పంచాయతీల అభివృద్దిని కాంక్షించని మాజీ శాసన సభ్యులు శంకర్‌నాయక్, మాజీ ఎంపీ బలరాంనాయక్‌లు మళ్లీ ఓట్లడిగేందుకు వస్తున్నారని, వారికి ఓటుతోనే ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. వారు స్థానికేతరులు కావడంవల్లే నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలి…అక్కడే అన్న చందంగా మారిపోయిందని విమర్శించారు. స్థానికుడు ఎమ్మెల్యే అయితే సమస్యలు పరిష్కారమవుతాయన్న విషయం ప్రజలు గుర్తించాలని కోరారు. తనకు సంపాదనపై వ్యామోహంలేదని…కేవలం ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీజేపీ కి బ్రహ్మరథం పడుతున్నారని, నియోజకవర్గం అభివృద్ది కావాలంటే కమలం పువ్వు గుర్తుకు తమ అమూల్యమైన ఓటువేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య, నాయకులు బాదరబోయిన రాఘవులు, ముల్లంగి ప్రతాప్‌రెడ్డి, శ్యాంసుందర్, మంద కృష్ణ, పద్మ, రాధాభాయి పటేల్, లక్ష్మణ్‌రావు, సిరికొండ సంపత్, భరత్, వెంకట్, శ్రీను, చిలివేరు సోమయ్య, సుభద్ర, బిక్షపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.



