సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజల అభినందనలు తథ్యం : వాణీమోహన్
ఏలూరు, జూలై 17: గ్రామస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసు కున్నప్పుడే ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించగలుగుతామని అప్పుడే యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ వాణీమోహన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్ల రెవెన్యూ డివిజన్ల అధికారులు, మండల తహసీల్దార్లతో నిర్వహించిన డివిజన్ స్థాయిసమన్వయ సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వాణీమోహన్ మాట్లాడుతూ, ప్రతీ గ్రామంలోని సమస్యలపై అవగాహన ఉండాలని, ఇందుకోసం కనీసం అరపూట ఆయా గ్రామాల్లో ఉండి గ్రామానికి సంబంధించి ఎంతో సమాచారాన్ని తెలుసుకోవడంతోపాటు సంబంధిత విఆర్‌వోల పనితీరును కూడా పరిశీలించవ్చన్నారు. తహసీల్దార్లుగా పనిచేసేందుకు మీ అంతట మీరు ముందుకు వచ్చారని, అందుకు తగ్గ పనితీరును చూపి సామాన్య ప్రజలకు మెరుగైన సేవలందింలన్నారు. రుణ అర్హతకార్డులు, మీ- సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు అవసరమైన రుణాలు సకాలంలో అందించడంలో రెవెన్యూ, బ్యాంకర్లు, వ్యవసాయశాఖాధికారులు సమష్టి కృషి ఎంతో అవసరమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 88 వేల మందికి రుణ అర్హత కార్డులు అందించాలని, అదేవిధంగా 31 కోట్ల రూపాయలు రుణాలు అదించామని చెప్పారు. ఉప ఎన్నికలకు ముందు 7 వేల కార్డులు అందించి కేవలం 50 లక్షల రూపాయల రుణాలు అందిస్తే ఉప ఎన్నికల అనంతరం ఒక నెలలో 31 కోట్ల రూపాయలు అందించగలడానికి అందరూ కలిసి పని చేయడమే కారణమన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది లక్షా 50 వేల మందికి రణ అర్హతకార్డులు అందించడంతోపాటు 200 కోట్ల రూపాయలు రుణాలు అందించే లక్ష్యాలను అధిగమించేందుకు కృషి చేయాలన్నారు. రుణ అర్హత కార్డులు పొందినవారికి బ్యాంకుల నుండి రుణాలు అందించేందుకు ప్రతి నెల తహసీల్దారు 5 లక్షల, వ్యవసాయశాఖాధికారి 3 లక్షల చొప్పున లక్ష్యాలు నిర్దేశించామన్నారు. విఆర్‌వో మొదలుకొని తహసీల్దారు వరకు వ్యవసాయశాఖాధికారి నుండి అసిస్టెంట్ డైరెక్టర్ వరకు సమిష్టిగా పనిచేసి కౌలుదారులను పెద్ద ఎత్తున రుణాలు అందించగలగాలన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి కౌలుదారులను గుర్తించి వారికి దరఖాస్తులు అందజేసి రుణ అర్హతకార్డులు పంపిణీ చేయాలన్నారు. కౌలుదారులకు రుణాలు అందించడంలో బ్యాంకర్ల నుండి విధమైన సమస్యలు ఎదురవకుండా వ్యవసాయశాఖాధికారితో కలిసిగాని, వ్యక్తిగతంగా గాని బ్యాంకు అధికారులను కలవాలన్నారు. రుణ అర్హతకార్డుల జారీ, బ్యాంకుల నుండి రుణాలకు సంబంధించి రోజువారి ప్రగతిని అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి. బాబురావునాయుడు మాట్లాడుతూ, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారులతో తహసీల్దార్ పదవి నిర్వర్తించడం దేవుడిచ్చిన వరంగా ఆయన పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిన రెవెన్యూ సిబ్బంది సమర్థవంతంగా పని చేయాలని అన్నారు. ప్రతి మండలంలో వీఆర్‌వోల పరిధిలో కౌలు రైతుల సమగ్ర వివరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కౌలురైతుకు, బ్యాంకుకు మద్య వీఆర్‌వో సమన్వయకర్తగా వ్యవహరిస్తే రైతుకు మేలు చేసినవారవుతారన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎన్నో రాయితీలు, సబ్సిడీలను కల్పించిందని వాటిని రైతులకు చేర్పడంలో ప్రతి అధికారి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించడంపైనే బ్యాంకర్లు కూడా తదుపరి రుణాలు మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంపై కూడా అధికారులు ప్రధాన దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ ఎం. మోహనరాజు, ఆర్‌డీఓ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.