సమస్యల వలయంలో పత్తి రైతులు అమ్మినా చేతికి డబ్బు రాక ఇక్కట్లు
ఆదిలాబాద్‌్, జనవరి 30 (): జిల్లా రైతులను ఏదో ఓ సమస్య పట్టి పీడిస్తోంది. విత్తనాలు నాటిన నుండి పంట దిగుబడి వచ్చి అమ్ముకునేంతవరకు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలతో సతమతమవుతుంటే మరోపక్క పండించిన పంటలను అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా పత్తి పంటను అత్యధిక విస్తీర్ణంలో సాగవుతోంది. పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ సంస్థలు సమయానికి ముందు రాక, కొనుగోళ్లు చేపట్టిన మాటి మాటికి సాంకేతిక కారణాలతో కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల పత్తిని తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారస్థులకు అమ్ముకుని రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు 3,900 చెల్లించాల్సి ఉండగా అంతకంటే తక్కువ ధర చెల్లిస్తూ వ్యాపారులు రైతులను దగా చేస్తున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్‌లో సుమారు 3.80 లక్షల హెక్టార్లలలో పత్తి సాగు అయిన నేపథ్యంలో సుమారు 70 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడి అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా సుమారు 25 లక్షల క్వింటాల్‌పైగా పత్తి అమ్మకాలు జరిగాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలు 27 లక్షల క్వింటాల్‌పైగా కొనుగోలు చేయగా ప్రైవేటు వ్యాపారస్థులు సుమారు 20 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రభుత్వ సంస్థలైన సీసీఐ 24, నాఫెడ్ 7 పత్తి కొనుగోళ్ళ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వ్యాపారస్థులకంటే ప్రభుత్వ రంగ సంస్థలు అధిక ధర ఇవ్వడంతో రైతులు పెద్ద ఎత్తున వారికి అమ్మకాలు జరిపారు. కాగా సరైన సమయంలో ప్రభుత్వ సంస్థల నుండి డబ్బులు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు అమ్మకాల కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడి ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు తాజాగా పత్తి అమ్మిన డబ్బులు అందడంలో జాప్యం నెలకొనడంతో నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన నాపెడ్ కొనుగోళ్లు చేసిన పత్తికి సంబంధించి 332 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు 50శాతం మాత్రమే డబ్బులు చెల్లించడంతో మిగత డబ్బుల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నాపెడ్ ద్వారా సుమారు 180 కోట్ల మేరకు రైతులకు డబ్బులు అందాల్సి ఉంది.