సమాచార కార్యలయంలో వెంకయ్య ఆకస్మిక తనిఖీ
న్యూఢిల్లీ, జులై11(జనంసాక్షి):
ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంకయ్యనాయుడు దిల్లీలోని ఆ శాఖ కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. సహాయ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్ రాథోడ్ కూడా ఆయన వెంట ఉన్నారు. సమయానికి కార్యాలయంలో లేని ఉద్యోగుల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గతవారమే వెంకయ్యనాయుడు ఈ మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన కార్యాలయంలోని అధికారులందరి గదులను స్వయంగా తనిఖీ చేశారు. మరుగుదొడ్ల పరిశుభ్రతను పరిశీలించారు. కార్యాలయం లోపల, ఆవరణలోని విద్యుత్ అమరికలను పరిశీలించారు’ అని కార్యాలయం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సమయానికి కార్యాలయానికి హాజరుకాని ఉద్యోగుల నుంచివెంకయ్యనాయుడు వివరణ కోరినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అగ్ని ప్రమాదాలను నివారించేందుకు కార్యాలయంలో ఓపెన్ కేబుల్స్‌ని వాడకుండా ఉంటే మంచిదని సూచించారు. 2014లో శాస్త్రి భవన్‌లోని కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొని దస్త్రాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.