సరఫరాకాని పాఠ్యపుస్తకాలు, దుస్తులు ఇబ్బందుల్లో పేద విద్యార్థులు..
ఆదిలాబాద్, జూలై 12: జిల్లాలో విద్యాశాఖ పనితీరు వల్ల పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, దుస్తులు విద్యార్థులకు పంపిణీ కాలేదు. ఈ నెల 16 నుంచి యూనిట్ టెస్టులు, నిర్వహిస్తుండడంతో పుస్తకాలు లేక విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో అధికారులకే తెలియాలి. జిల్లాలో అట్టహాసంగా తొలి విడతగా విద్యాపక్షోత్సవాలు నిర్వహించిన అధికారులు రెండవ విడుతగా ఈ నెల 9 నుండి 21వ తేదీవరకు విద్యాపక్షోత్సవాలు జరుపుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు సరఫరా చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక పాఠశాలలో మరుగుదోడ్లు, మంచినీటి సౌకర్యం తదితర వసతులు లేవు. మరికొన్ని పాఠశాలల భవనాలు, అదనపు గదుల నిర్మాణం పూర్తి కాలేదు. అనేక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు, పాఠశాలల పర్యవేక్షించాల్సిన మండల విద్యాధికారుల ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల విద్యారంగం కుంటుపడుతోంది. జిల్లాలో 3,559 ప్రాథమి పాఠశాలలు, 716 ప్రాథమికొన్నత పాఠశాలలు, 751 ఉన్నతపాఠశాలలు ఉన్నాయి. ఇందులో 4 లక్షల మంది విద్యార్థులు చదవులు కొనసాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి 20 లక్షలకుపైగా పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటివరకు 80 శాతం మాత్రమే పాఠ్యపుస్తకాలు పంపిణీ అయ్యాయి. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.