సరస్వతీదేవీగా కనకదుర్గమ్మ 

దుర్గగుడికి పోటెత్తిన భక్తజనం
భవానీ నామస్మరణతో మార్మోగిన ఇంద్రకీలాద్రి
దుర్గాదేవిని దర్శించుకున్న రోజా, పలువురు ప్రముఖులు
విజయవాడ,అక్టోబర్‌5 (జనంసాక్షి):   ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా..ఇంద్రకీలాద్రిపై కొలువైన ముగ్గుర్మమలగన్న మూలపుటమ్మ కనకదుర్గమ్మ అమ్మవారు ఏడవ రోజు శనివారం సరస్వతిదేవిగా దర్శనమిచ్చారు. జగన్మాత దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో దుర్గగుడికి పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులంతా జై..భవానీ… జైజై జగజ్జననీ నామస్మరణ చేసుకుంటు అమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు
చేస్తున్నారు. ఇంద్రీకీలాద్రి అంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం కావటంతో దుర్గమ్మను సరస్వతి దేవి అలంకారంలో దర్శించుకునేందుకు క్యూ లైన్లలో వేచి ఉన్న వేలాదిమంది భక్తులు కెనాల్‌ రోడ్డులోని వినాయకుడు గుడి వద్ద నుంచి ఇంద్రకీలాద్రిపై రాజగోపురం వరకు ఉన్న క్యూ మార్గంలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన శనివారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడుసరస్వతీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లి సాక్షాత్కారించింది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, దండ, కమండలం ధరించి అభయముద్రతో సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించింది. అమ్మవారికి గారెలు, పూర్ణాలను నైవేద్యంగా సమర్పించారు.
దుర్గమ్మను దర్శించుకున్న రోజా..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ సరస్వతీ అలంకారంలో దర్శనమిస్తున్నారు. శనివారం దుర్గమ్మను ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గతేడాది ఇదే రోజు అమ్మను దర్శించుకుని జగన్‌ను సీఎం చేయాలని కోరుకున్నానని తెలిపారు. నేడు జగన్‌ను ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరుకున్నట్టు పేర్కొన్నారు. ప్రశాంతంగా ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుంటున్నారని రోజా పేర్కినంనారు. రోజాతో పాటు పలువురు ప్రముఖులు సరస్వతీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు భారీగా పోటెత్తడంతో వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.