సరస్సులకు పర్యాటక శోభ
చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
వరంగల్,అక్టోబర్21 ( జనం సాక్షి): ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప,పాకాల సరస్సులకు జలకళ
సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయాలు అన్నీ నిండుకుండలా మారాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాకపెరుగుతోంది. పాకాలకు వర్షాలకు సహజంగానే నీరు రాగా, రామప్ప కూడా నిండుకుండలా తయారయ్యింది. తగంలో మాత్రం దేవాదులతో నీటిని తరలించే వారు. సరస్సు ఎగువ ప్రాంతంలోని చలివాగు నుంచి ఎప్పటిలానే నీరు వస్తోంది. ఇదిలావుంటే పాకాల సరస్సు పూర్తిగా నిండి రెండు రోజులుగా మత్తడి పరవళ్లు కొనసాగుతుండటంతో పర్యాటకులతో సందడి నెలకొంది. సరస్సు పూర్తిగా నిండటంతో పర్యాటకుల ఉత్సాహం నీటి పరవళ్లులా ఉరకలు వేస్తోంది. ఉద్యానవనంలోకి అనుమతి లేకపోవడంతో పలువురు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మత్తడి పోస్తుండటంతో పర్యాటకులు సందడి చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, యువకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పాకాలలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టడంతో సందర్శకులు మత్తడిలో కేరింతలు కొడుతూ ఆనందంగా గడిపారు. మరోవైపు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో చెరువులు అలుగు పోస్తున్నాయి. అనేక చెరువులు నిండాయి. దీంతో సహాయక చర్యలుముమ్మరం చేశారు. అలాగే మరో రెండురోజులు వర్షాలకు అవకాశం ఉందని చెప్పడంతో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు వచ్చాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులను సంరక్షించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కూడా తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రత్యేకంగా వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. జిల్లాలో మత్తడి పడుతున్న ప్రతి చెరువులను పర్యవేక్షించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టం అంచనా వేయాలని సూచించారు. ప్రధానంగా చెరువుల రక్షణకుచర్యలు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వర్షాల తీవ్రత తగ్గే వరకు అధికారులంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ఎవరికీ సెలవులు మంజూరు చేయొద్దని కలెక్టర్ సూచించారు.