సరిబేసిని ఉల్లంఘించిన ఎంపి పరేశ్‌ రావల్‌

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25

బీజేపీ ఎంపీ పరేష్‌ రావల్‌ సరి బేసీ నిబంధనను ఉల్లంఘించారు. సోమవారం  బేసీ సంఖ్య గల వాహనాన్ని ఉపయోగించాల్సి ఉండగా సరి సంఖ్య కారులో వచ్చి పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం దేశ రాజధానిలో కాలుష్య నియంత్రణ కోసం ఈ విధానన్ని అమలు చేస్తోంది. ఈమేరకు ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ ప్రభుత్వం వాహనాలను నియంత్రిస్తూ సరి బేసీ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే బేసీ సంఖ్య నిబంధన అమలులో ఉండగా ఎంపీ పరేష్‌ రావల్‌ పార్లమెంట్‌కు సరి సంఖ్య వాహనంలో చేరుకున్నారు. సరి బేసీ సంఖ్య వాహనాల విధానాన్ని ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ఎంపీలు పార్లమెంట్‌ భవనానికి చేరుకోవడానికి ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌ ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించింది. బీజేపీకి చెందిన వడోధర ఎంపీ రంజన్‌ భట్‌, మరో ఎంపీ హరి ఓం పాండే ఈ ప్రత్యేక బస్సులో పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఎంపీ రంజన్‌ భట్‌ మాట్లాడుతూ.. ఈ సర్వీసుకు మద్దతునిస్తున్నానని అన్నారు. కాలుష్య నియంత్రణ కోసం కేజీవ్రాల్‌ అవలంబిస్తోన్న మంచి పద్దతి అని కితాబిచ్చారు. అయితే ఈ అవకాశాన్ని మిగతా ఎంపీలు ఉపయోగించుకోక పోవడం కొస మెరుపు. కేజీవ్రాల్‌ ప్రభుత్వం ఇంత మంచి సౌకర్యం ఎంపీలకు కల్పించినా ఎవరూ ఉపయోగించుకోలేక పోయారని విమర్శలు వస్తున్నాయి.