సర్కార్ నిర్లక్ష్యం వల్లే సంక్షోభంలో వ్యవసాయ రంగం
సీపీఐ నేత జి. మల్లేష్
ఆదిలాబాద్, ఆగస్టు 3 : ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని సీపీఐ శాసనసభ పక్ష నేత జి. మల్లేష్ ఆరోపించారు. రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పార్టీ అనుబంధ సంఘమైన రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రైతు పోరుబాట యాత్ర శుక్రవారం మంచిర్యాలకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి సెజ్‌ల కోసం సేకరించిన భూములను తిరిగి వారికే అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోనందునా రైతులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎరువులు, విత్తనాల ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేనందునా నల్లబజార్‌లో కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రైతులపై ఎలాంటి మమకారం లేదని, ముఖ్యమంత్రి చేపట్టిన ఇందిరమ్మ బాట ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కాదని, కేవలం రానున్న ఎన్నికల ప్రచారం కోసమేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ముంపునకు గురైన రైతులకు నిర్ణీత గడువులోగా నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.