సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టులో ఊరట..

ముంబాయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు ముంబై సెషన్స్ కోర్ట్ విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను బాంబే హైకోర్ట్ సస్పెండ్‌ చేసింది. ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పును హైకోర్టు పెండింగ్ లో పెట్టింది. సెషన్స్ కోర్టు తీర్పుపై స్టే విధించింది. హిట్ ఆండ్ రన్ కేసులో ఈనెల 6న ముంబాయి సెషన్స్ కోర్టు సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు ఇచ్చింది. తీర్పుపై హైకోర్టు గతంలో 48 గంటల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్‌ గడువు ఇవాళ ముగుస్తుండడంతో మరోసారి బెయిల్‌పై విచారణ జరిగింది. అయితే కింది కోర్ట్‌ తీర్పు విచారణ సక్రమంగా లేనందున జైలు శిక్షను సస్పెండ్‌ చేయాలని కోరుతూ సల్మాన్‌ ఖాన్‌ తరపు న్యాయవాది వాదించారు. కారులో నలుగురు ఉన్నారని..నాలుగో వ్యక్తి కమాల్‌ఖాన్‌ సాక్ష్యాన్ని ప్రాసిక్యూషన్‌ పట్టించుకోలేదని. టైరు పక్చరైన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. ఢిఫెన్స్‌ లాయర్‌ అభ్యంతరాలకు ప్రాసిక్యూషన్‌ కూడా సమాధానం చెప్పింది. శిక్షను నిలుపుదల చేయవద్దని హైకోర్టును ప్రాసిక్యూషన్‌ తరపు న్యాయవాది వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జ్‌ శిక్షను సస్పెండ్‌ చేస్తూ ఆదేశించారు. సెషన్స్‌ కోర్టు తీర్పుపై విచారణను జులైకి వాయిదా వేసింది. మరో వైపు తాజా పూచీకత్తుతో సల్మాన్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్… హైకోర్టుకు వ్యక్తి గత బాండ్లు సమర్పించి.. బెయిల్ పై బయటికి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ఐదేళ్ల శిక్షను సస్పెండ్ చేయడంతో సల్మాన్ తల్లిండ్రులు, బంధువులలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.