సహజ వనరులు భారత్‌కు తిరుగులేని శక్తి

దేశాభివృద్ధిలో కార్పొరేట్లు కలిసిరావాలి
రాహుల్‌ ఆకాంక్ష
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి):
శక్తికి భారత్‌ మారుపేరు.. సహజ వనరులే భారత్‌కు శక్తి.. అని కాంగ్రెస్‌ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సిఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో గురువారం ఉదయం ఆయన పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సిఐఐ సదస్సుకు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావి స్తున్నానని అన్నారు. భారతీయులు చాలా తెలివైన వారు.. ఆశావాదులు.. ధైర్యవంతులు అన్నారు. గంగ, యమున, సరస్వతి.. తదితర నదుల శక్తే భారత్‌కు జీవనాధారమన్నారు. సహజ వనరులే భారత్‌కు శక్తి అన్నారు. భారత్‌లో ఉన్నన్ని సహజ వనరులు ప్రపం చంలో మరెక్కడా లేవన్నారు. భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం.. భారతదేశ   అభివృద్ధిలో పారిశ్రామిక రంగానిదే అగ్ర భాగం అన్నారు. భారత అభివృద్ధిలో కార్పొరేట్లు కలిసి రావాలన్నారు. దేశ అభివృద్ధికి రోడ్లు, నౌకాయానం, విద్యుత్‌ కీలకమన్నారు. మనదగ్గర ఐడియాలకు కొదవలేదన్నారు. పేద ప్రజలకు సమాజంలో గుర్తింపు లేదన్నారు. గ్రామం దాటితే వారెవరో గుర్తించలేని పరిస్థితి నెలకొందన్నారు. అందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. భారత దేశంలో మేధావులు, నిపుణులకు కొదవలేదన్నారు. విద్యార్థుల్లో అవసరమైన నైపుణ్యత కొరవడుతోందన్నారు.  యూని వర్శిటీలు పరిశ్రమలతో అనుసంధానం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఉద్యోగాల కల్పనలో పరిశ్రమలు ముందుండాలన్నారు. భవిష్యత్తు అవసరాల కోసం విద్యారంగంలో మార్పులు రావాలి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తేనున్నట్టు చెప్పారు. దేశంలోని ప్రజలకు కనీస అవసరాలు కల్పించాల్సిన అవసరం  పారిశ్రామిక వేత్తలపై ఉందన్నారు. మౌలిక సదుపాయాల కొరత ఆర్థికవృద్ధికి అవరోధంగా మారిందన్నారు. సమగ్ర అభివృద్ధి తోనే దేశంలో పేదరికాన్ని నిర్మూలించగలమన్నారు. యుపిఎ హయాంలో భారత్‌ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. యుపిఎ పాలనలో గణనీయ ప్రగతిని సాధించామని అన్నారు. పారిశ్రామిక భాగస్వామ్యం లేనిదే దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లలేదన్నారు. భాగస్వామ్యం, కలిసి పనిచేయకపోతే అభివృద్ధి మరింత కష్టంగా మారుతుందన్నారు. భారత్‌ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పేది పారిశ్రామికవేత్తలేనని అన్నారు. భారత్‌ అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలే కీలకమన్నారు. అందరం కలిసి దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్దాం.. అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.తన ఆశలన్నీ దేశం కోసం..దేశాభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు.  అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. పారిశ్రామికవేత్తల ప్రశ్నలకు ధీటుగా బదులిచ్చి  తన లక్ష్యాన్ని నిర్దేశించారు. సిఐఐ సమావేశంలో సుమారుగా 1500మందికి పైగా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నట్టు సమాచారం.