సాంకేతికతతో పోలీసింగ్‌ సులువవుతోంది

– తెదేపా హయాంలో నక్సలిజం, రౌడీయిజాన్ని అరికట్టాం
– అందుకే నాపై అలిపిరి దాడి జరిగింది.
– శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐల ముఖాముఖిలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జూన్‌27(జ‌నం సాక్షి) : సాంకేతికతను వినియోగిస్తే పోలీసింగ్‌ సులువు అవుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాదర్బార్‌ హాలులో ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 652 మంది ఎస్సైలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమలో ఫ్యాక్షన్‌, హైదరాబాద్‌లో వీధికో గుండా ఉండేవాళ్లని, నగరాల్లో రౌడీయిజం ఉండేదని, నక్సలిజం హైదరాబాద్‌ వరకు వచ్చేసిందన్నారు. ఈ తరుణంలో తెదేపా అధికారంలోకి వచ్చాక రౌడీయిజం, నక్సలిజం అరికట్టామన్నారు. దానికి పర్యవసానంగా నాపై అలిపిరి దాడి జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. సాంకేతికతతో పరిశోధనే కాదు, నేరాలు జరగకుండా అరికట్టగలగాలి. తప్పు చేస్తే దొరికిపోతామనే భయం ఉంటే.. నేరాలే జరగవని చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 20వేల సీసీ కెమెరాలు పెట్టబోతున్నామని,  పోలీసు కానిస్టేబుల్‌ ఏ చిన్నపాటి తప్పు చేసినా సీఎంకే ఆపాదించేస్తారు. పోలీసులు చెడు చేసినా.. మంచి చేసినా ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని చంద్రబాబు అన్నారు.