సాకర్ సంబరానికి కౌంట్ డౌన్
రష్యా వేదికగా ఫుట్‌బాల్ సంబరం
14న తొలి సమరం
రష్యా చేరుకుంటున్న అభిమానులు
మాస్కో,జూన్7(జనం సాక్షి): ప్రపంచంలో ఇప్పుడు ఫుట్ బాల్ ఫీవర్ అంటుకున్నది. కోట్లాది అభిమానుల ఆదరాభిమానాలతో సాకర్ వరల్డ్ కప్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్పోర్ట్స్ టోర్నమెంట్ మళ్లీ అలరించబోతోంది. 88 ఏళ్ల నుంచి జరుగుతున్న సాకర్ వరల్డ్ కప్ చరిత్రలో ఎన్నో మధుర స్మృతులు, ఎన్నో అద్భుత క్షణాలు, యావత్ క్రీడాప్రపంచం ఏకం చేసే సాకర్ సమరం కోసం అన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటాయి. గోల్స్ గోలలో మురిసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. 12 ఏళ్ల తర్వాత మళ్లీ యూరప్ లో వరల్డ్ కప్ జరుగుతుండటంతో అక్కడి ప్రేక్షకుల ఆనందానికి అంతే లేదు. రష్యా వేదికగా జరిగే ఈ మహా సంగ్రామం సాకర్ వరల్డ్ కప్ చరిత్రలో 21వది. ఈనెల 14న జరిగే తొలి సమరంలో ఆతిథ్య రష్యా సౌదీ ఆరేబియాతో పోటీపడుతుంది. జూన్ 30 నుంచి జూలై 3 వరకు రౌండ్ 16 మ్యాచులు జరగుతాయి. జులై 6, 7 తేదీల్లో క్వార్టర్ ్గ/నైల్ మ్యాచులు.. జూలై 10, 11 న సెవిూ ఫైనల్స్ జరుగుతాయి. జూలై 14న థర్డ్, ఫోర్త్ ప్లేస్ కోసం పోటీ ఉంటుంది. జూలై 15 మాస్కో వేదికగా గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.ఇక ఈ సారి ప్రపంచకప్ లో రష్యా జబివాకా మస్కట్ గా అలరిస్తోంది. ఎకతెరీనా బొచరోవా అనే విద్యార్ధి రూపొందించిన ఈ మస్కట్ ఆన్‌లైన్ ఓటింగ్ ద్వారా ఎంపికయింది. ఫిఫా ట్రోఫీ అసలు స్వరూపాన్ని మార్చకుండా ఆతిథ్య దేశం రష్యా నేపథ్యంతో ప్రపంచకప్ లోగోను రూపొందించారు. ఈ మహా సంగ్రామం సందర్భంగా రష్యా వెళ్లేందుకు ఎలాంటి వీసా అవసరం లేకుండా నిబంధనలు సడలించారు.1930లో తొలిసారి ఉరుగ్వే వేదికగా తొలి ప్రపంచ సమరం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం కారణం గా 1942, 1946లలో పోటీలు నిర్వహించ లేదు. స్టార్ టీమ్ బ్రెజిల్ అత్యధికంగా ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచింది. ప్రస్తుతం డిపెండింగ్ ఛాంపియన్ జర్మనీ తో పాటు ఇటలీ నాలుగు సార్లు విజేతగా నిలిచాయి. అర్జెంటీనా, ఉరుగ్వే తలా రెండు సార్లు, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్ ఒక్కోసారి వరల్డ్ కప్ టైటిల్ సాధించాయి. ఇక నెదర్లాండ్స్ మూడుసార్లు రన్నరప్ గా నిలిచింది. ప్రస్తుతం వరల్డ్ కప్ లో 32 జట్లు బరిలోకి దిగుతున్నాయి. 8 గ్రూపులుగా 32 జట్లను విభజించారు. గ్రూప్ ఏ లో ఆతిథ్య రష్యాతో సౌదీ ఆరేబియా, ఈజిప్ట్, ఉరుగ్వే ఉన్నాయి, గ్రూప్ బీ లో పోర్చ్ గల్, స్పెయిన్, మెరాకో, ఇరాన్ ఉన్నాయి. గ్రూప్ సీ లో ఫ్రాన్స్, ఆస్టేల్రియా, పెరూ, డెన్మార్క్ జట్లున్నాయి. గ్రూప్ డీ లో అర్జెంటీనా, ఐస్ లాండ్ క్రోయేషియా, నైజీరియా టీంలున్నాయి. ఇక గ్రూప్ ఈ లో బ్రెజిల్, స్విట్జర్లాండ్ తో పాటు కోస్టారికా, సెర్బియా ఉన్నాయి. గ్రూప్ ఎఫ్ లో జర్మనీ, మెక్సికో, స్వీడన్ సౌత్ కొరియా ఉంటే.. గ్రూప్ జీలో బెల్జియం, పనామా, ట్యూనీషియా, ఇంగ్లండ్ జట్లున్నాయి. చివరిదైన గ్రూప్ హెచ్ లో పోలండ్, సెనెగల్, కొలంబియా, జపాన్ టీంలున్నాయి. మ్యాచులన్నీ రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరుగుతాయి. గ్రూపులో టాప్ ప్లేస్ లో నిలిచిన రెండు జట్లు రౌండ్ 16 లోకి అడుగు పెడతాయి. నాలుగు సార్లు ఛాంపియన్ అయిన ఇటలీ ఈసారి వరల్డ్ కప్ కు అర్హత సాధించలేకపోయింది. పనామా, ఐస్ లాండ్ దేశాలు తొలిసారిగా వరల్డ్ కప్ లో ఆరంగేట్రం చేస్తున్నాయి. ఇక వరల్డ్ కప్ లో గెలిచిన జట్టకు భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. విజేతకు 38 మిలియన్ యూఎస్ డాలర్ల ప్రైజ్ మనీ ఇస్తారు. రన్నరప్ కు 28 మిలియన్ యూస్ డాలర్లు అందుతాయి. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 24 మిలియన్ యూఎస్ డాలర్లు ముట్టజెప్తారు. నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు 22 మిలియన్ యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీ ఇస్తారు. మొత్తానికి మరో వారం రోజుల్లో మెగా సాకర్ సమరం ప్రారంభం కాబోతోంది. నెల రోజుల పాటు జరిగే అద్భుతమైన క్రీడాసమరం కోసం యావత్ క్రీడాలోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. గోల్ మార్
అంటూ ఊగిపోయే సమయం దగ్గరవుతున్నా కొద్దీ ఫుట్‌బాల్ ఫీవర్ అంతకంతకూ పెరుగుతోంది.