సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఆక్షేపణీయం
పత్రికా స్వేచ్ఛను కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలి
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (జనంసాక్షి) :
సాక్షి ఎడిటర్, ఇతర సిబ్బందిపై పల్నాడు మండలం నాగార్జునసాగర్ పోలీసులు అక్రమ కేసులు బనాయించడాన్ని ఆ పత్రికా యాజమాన్యం తీవ్రంగా ఖండిరచింది. ఇది పత్రికా స్వాతంత్య్రాన్ని హరించడమేనని, తప్పుడు కేసులు నమోదు చేసి పాత్రికేయులను భయాందోళనలకు గురిచేయడం నాలుగో స్తంభమైన మీడియాకు తీవ్ర భంగమని పేర్కొంది. ఈ మేరకు పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ కు విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 5న సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎడిషన్లలో ఓ హత్యకు సంబంధించి రెండు భిన్నమైన వార్తలు ప్రచురితమ య్యాయని టిడిపి నేత ఫిర్యాదు చేశాడు. దీంతో ‘సాక్షి’ ఎడిటర్ ఆర్. ధనంజయ రెడ్డి, ఆరుగురు ఇతరులపై ఏప్రిల్ 9న కేసులు నమోదయ్యాయి. బీఎన్‌ఎస్ 196(1), 352, 353(2), 61(1) ఆర్/డబ్ల్యూ 3(5) వంటి సెక్షన్లు చేర్చారు. ఈ నేపథ్యంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిన సాక్షి యాజమాన్యం.. పోలీసుల చర్యను తీవ్రంగా ఆక్షేపించింది. ఏపీ సర్కారు, పోలీసులు ఉద్దేశపూర్వకంగా, మీడియా ప్రతినిధులను బెదిరించేందుకు ఈ చర్యకు ఒడిగట్టారని ఆరోపించింది. ఈ ఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పందించి, పత్రిక స్వాతంత్రాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సాక్షి బృందం కోరుతోంది.