సాగర్ – శ్రీశైలం నుంచి లాంచీ ప్రయాణం
– 8నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నాం
– పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్
నాగార్జునసాగర్, సెప్టెంబర్3(జనం సాక్షి) : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ తెలిపారు. సాగర్ జలాశయంలో పూర్తిస్థాయిలో నీరు ఉండటంతో సాగర్-శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రతి బుధ, శనివారాలలో రెండుసార్లు ఈ ప్రయాణం ఉంటుందన్నారు. ఈ ప్రయాణం రెండు రోజుల పాటు సాగుతుందన్నారు. మొదటి రోజున ఉదయం 6:30 గంటలకు బస్సు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాగర్‌కు ఉదయం 10 గంటలకు చేరుతుందని, సాగర్ నుంచి 10:30 గంటలకు లాంచీ బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు శ్రీశైలం చేరుతుందన్నారు. ఆ రాత్రి అక్కడే బస చేసి రెండో రోజు ఉదయం 9:30 గంటల నుంచి శ్రీశైలంలోని సందర్శన స్థలలాను చూపిస్తారన్నారు. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 మధ్య భోజనాలు పూర్తి చేసిన తరువాత శ్రీశైలం నుంచి బస్సు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు హైదరాబాదు చేరుకుంటుందని చెప్పారు. శ్రీశైలం నుంచి లాంచీలోనే వద్దామనుకుంటే 11.30 గంటలకు లాంచీ బయల్దేరి సాయంత్రం 6.30 గంటలకు సాగర్ చేరుతుందని మనోహర్ వెల్లడించారు.
చార్జీల వివరాలు …
హైదరాబాద్ నుంచి శ్రీశైలం(రాను పోను) పెద్దలకు రూ.3,000. పిల్లలకు రూ.2,400, సాగర్ నుంచి శ్రీశైలం(బోటులో రాను, పోను) పెద్దలకు రూ.2,200. పిల్లలకు రూ.1,800, ఒకవైపు ఛార్జీ(బోటులో) అయితే పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 వసూలు చేయనున్నట్లు ఎండీ మనోహర్ తెలిపారు.