సాగర్ కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలి – ఎమ్మెల్యే, ఆర్డీవోకు రైతుల అభ్యర్థన

మునగాల, జూన్ 04(జనంసాక్షి): నాగార్జునసాగర్ ఎడమ కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మునగాల మండల కేంద్రానికి చెందిన రైతులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు, ఆర్డీవో కిషోర్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు. కోదాడలో శనివారం వారు ఎమ్మెల్యే, ఆర్డీవోను అభ్యర్థించారు. ఈ సందర్భంగా రైతు జానకి రెడ్డి మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ఎడమ కాలువ వెంట చిన్న సన్నకారు రైతులు ఎన్ఎస్పి కెనాల్  పరిధిలో భూములు కోల్పోయిన రైతులు పోడు భూములుగా ఉన్న కాలవను డబ్బులు ఖర్చు పెట్టుకొని  చదును చేసి సాగు చేసుకుంటున్నారని, అటువంటి వారి భూములను ప్రభుత్వం లాక్కోవడం నిజంగా దుర్మార్గమైన చర్య అని  అన్నారు. ఎన్నెస్పీ కాలవ వెంట  మొక్కలు నాటే కార్యక్రమాన్ని విరమించాలని కోరారు. సాగు చేసుకుంటున్న వారంతా ఎస్సీ ఎస్టీ బీసీలకు చెందిన వారేనని అన్నారు. మొక్కలు నాటడం వలన జీవన ఉపాది కోల్పోయే ప్రమాదం ఉందని, రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని వారు అన్నారు. కాలువ వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపివేయాలని వారు కోరారు  ఈ కార్యక్రమంలో రైతులతో పాటు ఉపసర్పంచ్ ఎల్ వెంకయ్య, రాజేష్, భీమపంగు శంకర్, సిరికొండ యాదగిరి, సిరికొండ వీరయ్య, ప్రభాకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.