సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత
డిండి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు
మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండ,డిసెంబర్10(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం సాగు, తాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌డ్డి అన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కరువుతో నిండని డిండి ప్రాజెక్టును కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నింపి రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరును అందించనున్నట్టు తెలిపారు. పేదలల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో యుద్ధ ప్రాతిపదికన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీటి, ప్రజల తాగునీటి అందిస్తున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణా నదులపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం త్వరలో పూర్తి చేసి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలు తీరుస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మిషన్‌భగీరథ జలాలను అందజేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇందుకు అనుగుణంగా సిఎం కెసిఆర్ ఆదేశాలను జారీ చేశారని అన్నారు. మిషన్ భగీరథ నీటి వాడకంపై ప్రజల్లో ఉన్న అపొహాలు తొలగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధి చేసి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుటిత దీక్షలో ప్రతి గ్రామంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుందని, ఇందుకు అనుగుణంగా స్థానిక విద్యుత్ అధికారులు సరఫరాలో జాప్యంలేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచులు, అధికారులు స్పందించి పరిష్కార దిశగా అడుగులు వేయాలని సూచించారు.