సాధారణ వర్షాలకే రాజధాని ప్రాంతం జలమయం
సమస్యలపై 26న చర్చిస్తాం: సిపిఎం
విజయవాడ,ఆగస్ట్21(జనం సాక్షి): ఈ నెల 26 న జింఖానా గ్రౌండ్‌లో జనసేన-వామపక్షాల ఆధ్వర్యంలో నగర సమస్యలపై భారీ సదస్సు నిర్వహించనున్నామని మంగళవారం విలేకరుల సమావేశంలో సిపిఎం నేత సిహెచ్ బాబూరావు ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత మాట్లాడుతూ…. సాధారణ వర్షాలకే రాజధాని ప్రాంతాలైన విజయవాడ, అమరావతిలు ముంపుబారిన పడ్డాయన్నారు. నగరంలో వర్షాలకు 5 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయని తెలిపారు. రూ.461 కోట్లతో వర్షపు నీటి కాలువలు నిర్మిస్తున్నట్లుచెబుతున్న ప్రభుత్వం భారీ వర్షాలకు నగర రోడ్లు ఎలా జలమయమయ్యాయో చెప్పాలని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అమరావతిలో కొండవీటివాగు, పాలవాగులు పొంగుతున్నాయని, సెక్రటేరియట్‌లోని మంత్రుల కార్యాలయాలు కూడా వర్షం ప్రభావానికి గురయ్యాయని తెలిపారు. 60 మిల్లీవిూటర్ల వర్షపాతానికే విజయవాడ నగరం ముంపుకు గురికావడం, రాజధానిలో అనేక గ్రామాలు ముంపు బారినపడడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. 150 కిలోవిూటర్ల మేర నిర్మించాల్సిన వర్షపు నీటి కాలువల నిధులను ఇతర అవసరాలకు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వర్షపు నీటి కాలువల నిర్మాణంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై తక్షణం ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26 న జింఖానా గ్రౌండ్‌లో జనసేన, వామపక్షాల ఆధ్వర్యంలో నగర సమస్యలపై భారీ సదస్సు నిర్వహించనున్నామని ప్రకటించారు.