సానుభూతి వల్లే వైఎస్సార్ సీపీ విజయం
18 నుంచి 28 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్ష
అందరి సూచనల మేరకే భవిష్యత్తు కార్యాచరణ
టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయం
హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): ఉప ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు, ఆయన తల్లి, చెల్లి కన్నీటి వల్లే ప్రజల్లో సానుభూతి పెరిగి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదం చేసినట్టుగా టీడీపీ ఒక నిర్ధారణకు వచ్చింది. శనివారం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ ఓటమిపై కారణాలను విశ్లేషించింది. అనంతరం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విలేకరులతో మాట్లాడారు. జగన్ అరెస్టు, సానుభూతే కాకుండా కేంద్ర మంత్రి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్‌కు కలిసివచ్చాయని యనమల అన్నారు. జగన్ కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి అయ్యేవారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఓటర్లపై ప్రభావం చూపాయన్నారు.వాయలార్ రవి వంటి వారు కూడా జగన్‌ను ఉత్సాహపరిచేలా మాట్లాడారని, వీటన్నింటి వల్లే వైఎస్సార్ సీపీ లాభం పొందిందని పొలిట్‌బ్యూరోలో అభిప్రాయం పడ్డామన్నారు. పార్టీ ఓటమిపై 18 శాసనసభ, ఒక లోక్‌సభ నియోజకవర్గాల నుంచి నివేదికలు తెప్పించుకుంటామని ఆ నివేదికలపై పూర్తి స్థాయిలో విశ్లేషించేందుకు మరో రెండు సార్లు సమావేశం అవుతామని ఆయన తెలిపారు. ఈ నెల 18 నుంచి 28 వరకు రోజుకు రెండు నియోజకవర్గాల నివేదికలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విశ్లేషిస్తారని, ఆ తరువాత పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పని చేసిన అందరి నాయకుల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు. ఏది ఏమైనా ఉప ఎన్నికల ఓటమిపై లోతైన అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.
తెలంగాణపై తేల్చండి: చంద్రబాబుకు టీ టీడీపీ నేతల విన్నపం తెలంగాణపై ఈ నెల 15 తరువాత సానుకూల నిర్ణయం తీసుకుంటామని, కేంద్రానికి లేఖ రాస్తామని తాము ప్రజలకు హామీఇచ్చామని దీనిపై స్పందించాలని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లిదయాకర్‌రావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు చంద్రబాబును కోరినట్టు తెలిసింది. దీనిపై చంద్రబాబు స్పందించి త్వరలోనే అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.