పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే

సెప్టెంబర్ 1(జనం సాక్షి)  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ  అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ  శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిశారు. షీ జిన్‌పింగ్‌  అధ్యక్షతన జరుగుతున్న ఎస్‌సీఓ సదస్సు సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుతిన్‌ను మోదీ ఆత్మీయంగా పలకరించారు. షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందిస్తూ, చర్చించుకుంటూ ఓ పక్కకు వెళ్లారు. ఆ తర్వాత ఇరు దేశాధినేతలు కలిసి చైనా ప్రెసిడెంట్‌ షీ జిన్‌పింగ్‌ను కలిశారు. అనంతరం ముగ్గురూ కలిసి సంభాషించుకున్నారు.

ఈ చిత్రాలను ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ పంచుకున్నారు. పుతిన్‌ను కలవడం ఎల్లప్పుడూ అనందంగా ఉంటుందని, తియాన్‌జిన్‌లో చర్చలు కొనసాగుతున్నాయని అందులో పేర్కొన్నారు. కాగా, పుతిన్‌, మోదీ ఆత్మీయ పలకరింపు అనంతరం నడుచుకుంటూ వెళ్తుండగా, అక్కడే ఉన్న పాక్‌ ప్రధాని షెహబాజ్‌ చూస్తూ నిలబడిపోయారు./