సాయిబాబా మళ్లీ జైలుకు
నాగపూర్,డిసెంబరు 27(జనంసాక్షి) : మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సస్పెన్షన్‌కు గురైన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా నాగపూర్ సెంట్రల్ జైలు అధికారుల ఎదుట లొంగిపోయారు. డిసెంబరు 31వ తేదీ వరకు బెయిల్‌పై ఉన్న సాయిబాబా ముంబయి హైకోర్టు నాగపూర్ బెంచ్ సూచన మేరకు శుక్రవారం రాత్రి లొంగిపోయినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన బెయిల్ పిటిషన్‌ను 23వ తేదీన తిరస్కరించిన బెంచ్ 48 గంటల్లోగా లొంగిపోవాలని ఆదేశించింది. మరింత సమయం కావాలన్న సాయిబాబా విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయమూర్తి అరుణ్ చౌదరీ ఆయన రెండు రోజుల్లో లొంగిపోకుంటే అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. నాగపూర్ జైల్లో ఉండగా సాయిబాబాకు చికిత్స బాగానే అందించామంటూ జైలు డాక్టర్లు సమర్పించిన మెడికల్ రిపోర్టుతో సంతృప్తి చెందిన హైకోర్టు బెయిల్‌ను రద్దు చేసింది. వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ ఇవ్వాల్సిందిగా అతడి తరఫు న్యాయవాదులు జడ్జిని కోరినా లాభం లేకపోయింది. మావోయిస్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో సాయిబాబాను మహారాష్ట్రకు చెందిన గడ్జిరోలి పోలీసులు గత ఏడాది మేలో అరెస్టు చేశారు. సామాజిక కార్యకర్త పూర్ణిమా ఉపాధ్యాయ్ బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖతో సాయిబాబాకు ఆయన ఆరోగ్యం దృష్ట్యా మూడు నెలల తాత్కాలిక బెయిల్ లభించింది.