సారా హకాబీ సాండర్స్ కి
వాషింగ్టన్ : వైట్‌హౌస్ మీడియా సెక్రటరీ సారా హకాబీ సాండర్స్కు ఓ రెస్టారెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పనిచేస్తున్నందుకు ఆమె పట్ల రెస్టారెంట్ యజమాని దురుసుగా ప్రవర్తించారు. ఆమెను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోమ్మని గద్దించారు. ఈ విషయాన్ని సారా ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. ట్రంప్ కోసం పనిచేస్తున్నావా? అయితే, వెళ్లిపో అంటూ రెస్టారెంట్ ఓనర్ తనతో పేర్కొన్నట్టు ఆమె తెలిపారు. వర్జీనియా లెక్సింగ్టన్‌లోని ద రెడ్‌హెన్ రెస్టారెంట్‌లో శుక్రవారం ఈ ఘటన జరిగిందని తెలిపారు. యజమాని వెళ్లిపోమ్మని చెప్పడంతో తాను అక్కడి నుంచి మౌనంగా బయటకు వచ్చానని ఆమె తెలిపారు.ఈ ఘటన తనను పెద్దగా బాధపెట్టకపోయినప్పటికీ.. రెస్టారెంట్ ఓనర్ స్వభావాన్ని మాత్రం బయటపెట్టిందని ఆమె పేర్కొన్నారు. ‘ప్రజలతో నేను ఎప్పుడూ సమున్నతంగా నడుచుకుంటాను. నాతో విభేదించే వారిని కూడా గౌరవిస్తాను. నా తీరులో ఎలాంటి మార్పు ఉండబోదు’ అని ఆమె పేర్కొన్నారు. తన అధికారిక ట్విటర్ పేజీలో ఆమె చేసిన ఈ ట్వీట్‌కు 22వేలకుపైగా రిప్లైస్ వచ్చాయి. సారాకు అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా కామెంట్లు చేస్తున్నారు. సారా తండ్రి, అర్కాన్సా మాజీ గవర్నర్, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి మైక్ హకబీ కూడా ఈ ట్వీట్ పై స్పందించారు.