సాహా ఔట్.. దినేశ్ ఇన్
– ఆఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు దినేశ్ కార్తీక్ ఎంపిక
ముంబయి, జూన్2(జనం సాక్షి) : అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా స్థానంలో మరో వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది. దీంతో అఫ్గాన్‌తో జరిగే టెస్టుకు తాను సిద్ధంగా లేనట్లు సాహా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తీక్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ట్వీట్ చేసింది. అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు వృద్దిమాన్ సాహా దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేశారు అని ట్వీట్‌లో పేర్కొంది. బెంగళూరు వేదికగా జూన్ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్‌శర్మ, భువనేశ్వర్ కుమార్, జస్పీత్ర్‌బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కోహ్లి గైర్హాజరితో భారత జట్టుకు అజింక్యా రహానే సారథ్యం వహించనున్నాడు.