సింగరేణిలో అవినీతి అధికారులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి):

సింగరేణి లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చెమ్మెస్‌ డిమాండ్‌ చేస్తున్నా పట్టించుకోవడం లేదని  పేర్కొన్నారు. సింగరేణి కంపెనీలో ఉపరితల గనుల్లో మట్టి తొలగింపు, ఇసుక, బొగ్గుసరఫరాలో పర్చేజ్‌ విభాగంలో వందల కోట్ల అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయన్నారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. కార్మికులు చిన్న పొరపాటు చేస్తే వారిని సస్పెండ్‌ చేస్తూ ఛార్జిషీట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.సింగరేణిలో ప్రస్తుతం గుర్తింపు సంఘం తెబొగకాసం, ఏఐటీయూసీ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యారని హెచ్‌ఎంఎస్‌ నాయకులు ఆరోపించారు. సింగరేణి అధికారుల అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి తట్టుకోలేక హెచ్చెమ్మెస్‌ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్మిక సంఘాలు లేకుండా అధికంగా బొగ్గు ఉత్పత్తిని సాధించాలని కార్మికులను కిందిస్థాయి అధికారులను పరుగులు పెట్టించడం సరికాదన్నారు. దూకుడుగా వ్యవహరించే చైర్మన్‌ తన వైఖరిని మార్చుకోవాలని హితవుపలికారు. కంపెనీలో అత్యవసర పరిస్థితి తలపిస్తుందని విమర్శించారు.  ఇదిలావుంటే  సింగరేణి ఒప్పంద కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని  సీఐటీయూ డిమాండ్‌ చేసింది. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని జిల్లా నాయకులు హెచ్చరించారు. ఒప్పంద కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం సవతి ప్రేమ కనబరుస్తోందని ఆరోపించారు. ఎన్నికల్లో కేసీఆర్‌ ఇచ్చిన హావిూ ప్రకారం ఉద్యోగాలను శాశ్వతం చేయాలని డిమాండు చేశారు.