సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాలు ప్రకటించాలి. – బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, వేతనాలు తదితర చట్టబద్ధ హామీలపై ప్రకటన చేయాలి
సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాలు ప్రకటించాలి. – బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, వేతనాలు తదితర చట్టబద్ధ హామీలపై ప్రకటన చేయాలి
బెల్లంపల్లి, అక్టోబర్ 14, (జనంసాక్షి )
సింగరేణిలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో వాటాలు కేటాయించాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఎస్సీసీ డబ్ల్యూయూ – ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం బెల్లంపల్లిలోని అన్ని డిపార్ట్మెంట్ కాంటాక్ట్ కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఎస్సీసీ డబ్ల్యూయూ – ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుసూ తాళ్ళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ
గత ఐదు సంవత్సరాల నుండి సింగరేణి యాజమాన్యం లాభాల్లో వాటా గురించి ఎస్సీసీ డబ్ల్యూయూ – ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల కనికరం చుపెట్టడం లేదన్నారు. వాస్తవంగా కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించి ఉంటే సింగరేణి సంస్థకు లాభాలు ఎక్కడి నుంచి వచ్చేవో సింగరేణి యాజమాన్యానికి తెలిసి వచ్చేదన్నారు. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇవ్వడం వల్ల సింగరేణి సంస్థకు లాభాలు వస్తున్నాయని, ఈ లాభాలను కేవలం పర్మనెంట్ కార్మికులకు మాత్రమే పంచుతున్నారన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఒక పైసా కూడా ఇవ్వడం లేదని, ఒకే సంస్థలో పక్కపక్కకి పర్మనెంట్ కార్మికుడు కాంట్రాక్టు కార్మికుడు పనిచేస్తుంటే పర్మినెంట్ కార్మికునికి లాభాల వాటా ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికునికి ఇవ్వకపోవడం అనేది కాంట్రాక్ట్ కార్మికులను అవమానపరచడం, వివక్ష
చూపడమే అవుతుందన్నారు. ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే కుటుంబం అని చెప్పుకునే సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలను కేవలం పర్మనెంట్ కార్మికులకు పంచడం అనేది ఇది అత్యంత దుర్మార్గము, మోసం కనుక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటాను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీడబ్ల్యూయూ – ఐఎఫ్టీయూ రీజియన్ నాయకులు జి వెంకటి, ఎన్ క్రిష్ణ వేణి, గణేష్, లత, కొమరయ్య, బాను, లింగయ్య, కరుణ, సునీత, పొసక్క, అమృత, తదితరులు పాల్గొన్నారు.