సింగరేణి అధికారుల దౌర్జన్యం..?

జనంసాక్షి, మంథని : ఆర్జీ టు పరిధిలోని ఓసిపి త్రీ విస్తరణలో గత కొన్ని సంవత్సరాల క్రితం మంగళపల్లి, పెద్దంపేట గ్రామాలను సింగరేణి తీసుకొని నష్టపరిహారం చెల్లించిన విషయం తెలిసిందే. అయితే పెద్దంపేట జిపి పరిధిలోని ప్రజలకు తాగునీరు అందించేందుకు గతంలో మంగళ్ పల్లె నిర్మించిన లక్షా ఇరవై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ కు ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండానే శనివారం సింగరేణి అధికారులు బ్లాస్టింగ్ చేసి వాటర్ ట్యాంక్ ను కూల్చివేశారు. సింగరేణి భూ నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వ ఆస్తులను ఇంజనీర్ల ద్వారా లెక్క కట్టి ఆ డబ్బులను గ్రామపంచాయతీ అకౌంట్ లో వేసిన తర్వాతనే కూల్చాలని నిబంధనలు ఉన్నప్పటికీని దానికి విరుద్ధంగా సింగరేణి అధికారులు దౌర్జన్యంగా బ్లాస్టింగ్ చేసి వాటర్ ట్యాంక్ కూలగొట్టడం పట్ల పెద్దంపేట గ్రామ సర్పంచ్ చింతపట్ల నాగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన “జనంసాక్షి” తో మాట్లాడుతూ.. జిపి పరిధిలోని ఈ వాటర్ ట్యాంకుకు రావలసిన నష్టపరిహారాన్ని చెల్లించాలని పలుమార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వారు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సింగరేణి అధికారులు బ్లాస్టింగ్ చేసి మరి వాటర్ ట్యాంక్ ను కూల్చడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ స్పందించి తమ జిపికి వాటర్ ట్యాంక్ కు రావలసిన నష్టపరిహారం ఇప్పించడంతో పాటు వాటర్ ట్యాంక్ కూల్చివేసిన సంబంధిత సింగరేణి అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నాగరాజు డిమాండ్ చేశారు.