సింగరేణి బొగ్గు లక్ష్య సాధనపై సవిూక్ష

ఆదిలాబాద్‌,మార్చి31(జ‌నంసాక్షి): ఓసీపీ-2,ఏఎల్‌పీ విస్తరణకు భూఉపరితలంలో ఎస్సారెస్పీ కాలువ అడ్డంకిగా ఉండటంతో కాలువ మళ్లింపు పనులను త్వరగా పూర్తిచేయాలని సింగరేణి అధికారులు సూచించారు. ఏఎల్‌పీ నూతన పిట్‌ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించి త్వరగా పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని కోరారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆర్జీ-3, ఏపీఏ గనులకు నిర్థేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు చేపట్టాల్సిన పురోగతి పనులను అధికారులు  పరిశీలించారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో సింగరేణి మొత్తం విూద 66 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్థేశించింది.  దీనిలో భాగంగా ఆర్జీ-3, ఏపీఏకు నిర్థేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు ఇప్పటి నుంచే అధికారులను సమాయాత్తం చేస్తున్నారు. ఈ మేరకు ఓసీపీ-2 ఫేజ్‌-2 విస్తరణ పనులతోపాటు అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టులో రెండోప్యానెల్‌ పురోగతి పనులను పరిశీలించారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి నిర్థేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించటానికి ఎంత మంది మానవశక్తి అవసరం అనే విషయంపై చర్చించారు.  రక్షణ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు.  సింగరేణి కంపెనీలో బొగ్గు అన్వేషణ విషయంలో ఆ విభాగం పాత్ర ఎంతో కిష్టమైందన్నారు.  బొగ్గు నిక్షేపాలను నిరంతరం కనుగొంటేనే కంపెనీకి భవిష్యత్తు ఉంటుందన్నారు. సింగరేణి సంస్థలో అనేక గనులను ప్రారంభించి నడిపించే సత్తా ఉందన్నారు. నిధుల కొరత లేదన్నారు. బెల్లంపల్లి ఏరియాలో అన్వేషణ జరిగిన అబ్బాపూర్‌, చోపిడి, చింతగూడలో కొత్త గనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులు ఎంతో కష్టపడుతుంటే అందుకు తగినట్లు యాజమాన్యం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడతుందన్నారు. సింగరేణి కంపెనీ విస్తరణలో అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైందని అన్నారు. సింగరేణి కంపెనీ ఎన్నో ఒడుదుడుకులను, సవాళ్ళను ఎదుర్కొని ఈ రోజు జాతీయ స్థాయిలో మిగతా పరిశ్రమలతో పోటీపడటానికి ప్రతిఒక్కరి కృషి కారణమన్నారు. సింగరేణి కంపెనీలో బొగ్గు ఉత్పత్తిలో నిరంతరం ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు ఎదుర్కోని మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి అనేక నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు. నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసి దాన్ని ఖరీదు చేసే వినియోగదారులను సంతృప్తి పర్చడానికి అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించడం ఎంత ముఖ్యమో దాన్ని సకాలంలో అమ్మడంతో పాటు లాభాలు సాధించడం మరింత కష్టతరమైన పని అని ఆయన అన్నారు.