సిఎం కెసిఆర్ ఆశిస్సులతో దుబ్బాక అభివృద్ది
హుజూర్ నగర్ తరాహాలో నిధుల విడుదల
దుబ్బాకలో ఆర్యవైశ్యుల అలయ్ బలయ్‌లో మంత్రి హరీష్ రావు
సిద్దిపేట,అక్టోబర్26(జనంసాక్షి): సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. సీఎం ఆశీస్సులతో నారాయణఖేడ్‌ను కూడా అభివృద్ధి చేశానని చెప్పారు. ఎన్నికల వరకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దుబ్బాకలో ఉంటారు. కానీ తాను, సుజాతక్క ఎల్లప్పుడూ దుబ్బాకలోనే ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. దుబ్బాకలో ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను తప్పకుండా ఏర్పాటు చేస్తామని హరీష్ రావు హావిూనిచ్చారు. దుబ్బాక ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన అలాయ్ – బలాయ్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని తెలిపారు. ఉత్తమ్ మంత్రిగా ఉన్న సమయంలో దుబ్బాకకు ఒక్కసారి కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నాడు. హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ నేరుగా ఆ నియోజకవర్గానికి వెళ్లి రూ. 300 కోట్ల పనులు మంజూరు చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. రేపు అదే రీతిలో దుబ్బాకకు నిధులిచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదే అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇందులో అనుమానమే అవసరం లేదన్నారు. ఎన్నికలు వస్తాయి, పోతాయని.. ప్రజల కష్టసుఖాల్లో ఎవరు నిరంతరం ఉంటారో చూడాలని మంత్రి అన్నారు. రామలింగారెడ్డి గెలుపులో సుజాత కృషి ఎంతో ఉందని తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినా అతి సాధారణ జీవితం వారిదని చెప్పుకొచ్చారు. హుజూర్‌నగర్‌లో గెలిచిన తరువాత 300 కోట్లు కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. టీఆర్‌ఏస్ గెలిస్తే ఏమిస్తదని అంటున్న వారికి ఈ అభివృద్ధే సాక్ష్యమని అన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనది అని మంత్రి స్పష్టం చేశారు.
సుజాత తనకు దేవుడిచ్చిన సోదరి అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాక అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక బిజినెస్ వర్గాలకు చేయగలిగినంత సాయం చేసిందని.. ఏనాడు ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. అగ్రవర్ణ పేదలకు కూడా సాయం చేస్తున్నది ఒక్క టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. వైశ్య కార్పొరేషన్ టీఆర్‌ఎస్ మేనిఫాస్టోలోనే ఉన్నదన్నారు. నూటికి నూరు శాతం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంటింటికి నీళ్లు తెచ్చామని… సాగుకు కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తున్నాయన్నారు. ఒక్క సారి కాళేశ్వరం నీళ్లు వస్తే దుబ్బాక రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ మనస్సు గెలుచుకుందామని.. దుబ్బాకకు భారీ ఎత్తున నిధులు తెచ్చుకుందామని తెలిపారు. నిధులపై సవాల్ విసిరితే బీజేపీ ముఖం చాటేసిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణెళిష్ గుప్త మాట్లాడుతూ… వైశ్యులను గుర్తించి పదవులు కట్టబెడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని అన్నారు. అతి త్వరలో వైశ్య కార్పొరేషన్ వస్తుందని తెలిపారు. సర్వేలన్నీ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెబుతున్నాయని అన్నారు. సుజాతను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన భాద్యత వైశ్యులపై ఉన్నదని
ఎమ్మెల్యే గణెళిష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణెళిష్ గుప్త బిగాల, ఇంటర్నెషనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్త తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో శరవేగంగా అభివృద్ది
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంగా పురోగతి సాధిస్తుందని ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ దసరా పండుగ సందర్భంగా ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం అన్నింటా విజయాలు సాధించాలని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో సిద్దిపేటలోని రంగదాంపల్లి హనుమాన్ దేవాలయంలో, ప్రశాంత్ నగర్ హనుమాన్ దేవాలయంలో, నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయంలో, ఇమామ్ బాద్ శ్రీ దుర్గా మాత విగ్రహ నిమర్జన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ పర్వదినాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడు విూద మంచి విజయం సాధించే రోజు విజయ దశమి అని మంత్రి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు దసరా పండుగ మరిన్ని విజయాలు అందించాలని హరీష్ రావు కోరుకున్నారు.
—-


