సికింద్రాబాద్ గాంధీలో స్వల్ప అగ్నిప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తింపు
ప్రమాదంపై ఆరాతీసిన మంత్రి తలసాని
హైదరాబాద్,అక్టోబర్20 (జనంసాక్షి ) : సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దవాఖాన నాలుగో అంతస్తులోని విద్యుత్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదంతో దవాఖానలోని పలు వార్డుల్లోకి పొగ వ్యాపించింది. దీంతో రోగులు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా పలు వార్డుల్లోని రోగులను బయటికి పంపేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల దవాఖానలో కరెంటు తీగలు దగ్ధమయ్యాయని, త్వరలోనే వాటిని పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో గాంధీ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగిందని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ)రమేష్ రెడ్డి తెలిపారు. బుధవారం గాంధీ అగ్నిప్రమాద ఘటనా స్థలాన్ని డీఎంఈ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గాంధీలోనే ప్రత్యేకంగా అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి 15 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారని అన్నారు. ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. పరికరాలు పాడవ్వలేదని చెప్పారు. 120 మంది పేషేంట్లను పక్క వార్డులోకి తరలించామన్నారు. 2 రోజుల్లో అంత క్లియర్ చేస్తామని ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ బోర్డులన్నింటిని చెక్ చెయ్యమని చెప్పామన్నారు. అన్ని ఆస్పత్రులలో ఫైర్ సిబ్బంది ఉండేలా చూస్తామని తెలిపారు. పెద్ద ఆస్పత్రి కాబట్టి ఒక స్టేషన్ పెట్టామని…భారత దేశంలోనే గాంధీలో ఫైర్ స్టేషన్ ఉందని అన్నారు. మొదట్లో డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహించామని.. మళ్ళి ఒకసారి మాక్ డ్రిల్ని నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్ని ఆస్పత్రులలో ఇప్పటికే డాక్టర్లకు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ బ్లాక్లో లిమిటెడ్ పేషేంట్లు చాలా తక్కువగా ఉన్నారని రమేష్ పేర్కొన్నారు. గాంధీ హాస్పిటల్లో అగ్నిప్రమాద ఘటన గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరా తీశారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రస్తుతం తాను హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైదరాబాద్ చేరుకోగానే గాంధీని సందర్శిస్తానని చెప్పారు.