సిద్దిపేటలో పోటాపోటీగా ప్రచారం

IMG-20160330-WA0077అన్నిటా అగ్రస్థానంలో మంత్రి హరీశ్‌రావు
మెదక్‌,మార్చి31(జ‌నంసాక్షి): సిద్దిపేట మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆరున జరిగే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగ ఆకాంగ్రెస్‌ టిడిపిలు టిఆర్‌ఎస్‌తో పోటీపడి ప్రచారం నిర్వహిస్తున్నాయి. కేవలం ఈ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా సాగుతున్నాయి. అయితే అధికార పార్టీ మాత్రం చేసిన పనులను, చేయబోయే పనులను వివరిస్తోంది.ప్రధానంగా మంత్రి హరీష్‌ రావు అంతా తానై ప్రచారాంలో దూసుకుని పోతున్నారు. సిద్దిపేటను అన్ని రంగాల్లో రాష్టాన్రికి  ఆదర్శ నమూనాగా మార్చామన్నారు. త్వరలోనే సిద్దిపేట జిల్లా కానుందని, రైల్వేలైన్‌, గోదావరి జలాలు రానున్నాయన్నారు. వరాహాలు లేని పట్టణంగా మార్చామని, హరిత పట్టణంగా తీర్చిదిద్దామన్నారు. పట్టణంలో ఆరు శ్రేణుల రహదారి పనులు

సాగుతున్నాయని, త్వరలో బాహ్య వలయ రహదారిని రూ.50 కోట్లతో నాలుగు శ్రేణులుగా విస్తరిస్తామన్నారు. ప్రాంతీయ ఆసుపత్రిలో ఐసీయూ, ఎంసీహెచ్‌లో నవజాత శిశు కేంద్రం, కార్పొరేట్‌ తరహాలో పేదలకు ఉచిత వైద్యం ఇస్తున్నాయన్నారు.  విూకెందుకు ఓటేయాలని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు కాంగ్రెస్‌, భాజపా, తెదేపాలను ప్రశ్నించారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తూ సేంద్రియ ఎరువు తయారు చేస్తున్న బల్దియా సిద్దిపేటనే అన్నారు. కోమటిచెరువు పర్యాటక ప్రాంతంగా మారుతోందని, వైకుంఠథామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఎల్‌ఈడీ వెలుగులతో పట్టణం మెరిసి పోనుందన్నారు. చెత్తకుండీలు లేని పట్టణంగా సిద్దిపేట చరిత్ర సృష్టించిందని, 200 సీసీ కెమెరాలతో భద్రతపై దృష్టి పెట్టిన పట్టణంగానూ పేరు సాధించిందన్నారు. రూ.134 కోట్లతో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఈ స్థాయిలో నిర్మాణాలు చేపట్టే పట్టణం సిద్దిపేట అన్నారు. సిద్దిపేటలో ఎన్నికల ప్రచారానికి వచ్చే విపక్ష పార్టీల ముఖ్య నేతలు పట్టణంలోని అన్ని అంశాలను ఓ మారు పరిశీలించి కనీసం అందులో పది శాతమైన తమ ప్రాంతాల్లో జరిగిందా..? అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అధికారంలో ఉన్నపుడు సిద్దిపేటలో కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధిని అడ్డుకున్నారని, తెరాస అధికారంలోకి వచ్చాక ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక అన్ని నిధులూ సిద్దిపేటకేనా అని కాంగ్రెస్‌ మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, సునీతా లక్ష్మారెడ్డిలు ఆరోపించారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వీరంతా భంగపడ్డా ఇంకా ఆశచావలేదన్నారు.  ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఒక్క కార్పోరేటర్‌ సీటు గెలవలేదనీ, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు. దిల్లీ, బిహార్‌, యూపీ, గుజరాత్‌లో వరుసగా బిజెపికి ఎదురు గాలి వీచిందని అన్నారు.టిడిపికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది రాజీనామా చేసి తెరాసలో చేరారని, ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే పార్టీ వదిలిపోతుంటే ఇక్కడ టిడిపి ఎలా ఓట్లు అడుగుతుందని నిలదీశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు కాలికి బలపం కట్టుకు తిరిగినా ఒక్క సీటు రాలేదని, ఇక్కడ పోటీ దేనికన్నారు. అన్ని రంగాల్లో సిద్దిపేట, తెలంగాణ దూసుకుని పోతోందన్నారు.