సినిమా షూటింగ్స్ బంద్ అని ఎక్కడా చెప్పలేదు
సినీ పరిశ్రకు నష్టం చేస్తున్న అంశాలపై చర్చించాం
ఏ ఒక్కరి నిర్ణయంతో ఇది జరగదు: దిల్ రాజు
ఆగస్టు 1నుంచి షూటింగ్‌లు బంద్ అని మేం ఎక్కడా చెప్పలేదని, అన్ని కోణాల్లో ఆలోచించిన తరవాతే నిర్ణయాలు తీసుకుంటాం అని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయన సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నిర్మాతలంతా ఆలోచించు కోవాల్సిన సమయం ఇది. గతంలో కూడా ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. అప్పుడు కేవలం నిర్మాతే నష్టపోయేవాడు. ఇప్పుడు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం వాటిల్లింది. అందుకే నిర్మాతలంతా సమావేశమై పరిశ్రమలోని వివిధ అంశాలపై తీవ్రంగా చర్చిస్తున్నాం. అయితే ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి షూటింగ్ బంద్ చేయాలనే ప్రస్తావన ఎక్కడా రాలేదని అన్నారు. దానిపై కూలంకషగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటామని దిల్‌రాజ్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నిర్మాతలంతా ఒకే తాటిపై నడుస్తాం. ఇక ఒక సినిమా షూటింగ్ ఆపాలంటే నిర్మాత ఒక్కడి నిర్ణయమే సరిపోదు. ఆయా నిర్మాతలు దర్శకులు, హీరో హీరోయినతో మాట్లాడాలి. దానికి కొంత సమయం పడుతుంది. ఇలా చేస్తే నిర్మాత ఒక్కటే కాదు హీరో నుంచి టెక్నీషియన్ ఒకరు అందరూ నష్టపోతారు. నిర్మాతల బాధల్ని హీరోలు, టెక్నీషియన్లు అర్థం చేసుకుంటారని నమ్మకం ఉందని తెలిపారు. పాండమిక్ తరవాత ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారింది. వాళ్ల ఐక్యూ లెవల్స్ పెరిగాయి. వాటిని అందుకొనే సినిమాలకే మోక్షం లభిస్తుంది. కరోనా సమయంలో ప్రపంచ సినిమా మొత్తం చూసేసిన ప్రేక్షకులు అప్‌గ్రేడ్ అయ్యారు. మన దర్శకులు కథకులు అక్కడే ఆగిపోయారు. అందుకే వీరిద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ వచ్చింది. కాబట్టే కొన్ని సినిమాలు ఆడడం లేదు. పాండమిక్ సమయంలో నేను 10 కథలకు ఓకే చెప్పా. ఇప్పుడు అవన్నీ పక్కనపెట్టేశానని వివరించారు.