సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ధర్నా
విజయనగరం, జూలై 17: విద్యుత్, తాగునీరు సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణమైన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు, లెనినిస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. పార్టీ ఆర్గనైజర్ బి.శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా విద్యుత్ కోతలు తీవ్రతరం అయ్యాయన్నారు. ఫలితంగా విద్యుత్‌పై ఆధారపడి జీవిస్తున్న పని కార్మికులు, ఉపాధి లేక అలమటిస్తున్నారన్నారు. విద్యుత్ కోత ప్రభావం అన్ని రంగాలపై పడిందన్నారు. తక్షణమే అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అధికారిక విద్యుత్ కోతలతో పాటు అనధికారిక విద్యుత్ కోతలు అమలు అవ్వడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.