సిమెంట్‌ధరలు తగ్గించేందుకు చర్యలు

కలెక్టర్‌ హామీ
దీక్ష విరమించిన టీడీపీ నేతలు
కడప, జూలై 21: సిమెంట్‌ ధరలను వారంలోగా తగ్గించేందుకుఅవసరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతో టీడీపీ నాయకులు కలెక్టర్‌ వద్ద చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. ఆ మేరకు కలెక్టర్‌ హామీ ఇవ్వడంతో పాటు దీక్షను విరమింపజేశారు. జిల్లాలో సిమెంట్‌ ధరలు తగ్గించాలని, రైతాంగ సమస్యలు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీడీపీ నాయకులు గత ఐదు రోజులుగా కలెక్టరేట్‌ ఎదుట ఆమరణ దీక్ష చేపట్టారు. రాజ్యసభ సభ్యుడు రమేశ్‌నాయుడు, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నర్సింహారెడ్డి ఈ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలతో మంత్రుల్లో కదలిక వచ్చింది. మంత్రి రామచంద్రయ్య, పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డి హైదరాబాద్‌లో సిమెంట్‌ ఫ్యాక్టరీల యాజమాన్యంతో ప్రత్యేక చర్చలు జరిపారు. మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి కడపలో టీడీపీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.హైదరాబాద్‌, పొరుగున ఉన్న జిల్లాల్లో కంటే జిల్లాలోనే సిమెంట్‌ను అధిక ధరలకు విక్రయించడాన్ని మంత్రులు ఆక్షేపించారు. ఈ సందర్భంగా మంత్రులు యాజమాన్యాల నుంచి స్పష్టమైన హామీ పొందినట్టు సమాచారం. దీనికి తోడు జిల్లా కలెక్టర్‌ స్వయంగా కూడా రంగంలోకి దిగి మంత్రులతో చర్చలు జరిపారు. దీంతో యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ లభించినట్టు కలెక్టర్‌ దీక్షలో ఉన్న వారికి తెలిపారు. ప్రభుత్వం రైతాంగ సమస్యలపై కూడా దృష్టి సారించిందని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్టు వారికి వివరించారు. దీంతో వారు దీక్షను విరమించారు. కలెక్టర్‌పై తమకు నమ్మకం ఉందని అన్నారు. వారంరోజుల్లోగా ధరలు తగ్గించకపోతే సిమెంట్‌ లారీలను ఎక్కడికక్కడా అడ్డుకుంటామని దీక్షను విరమించిన నేతలు హెచ్చరించారు.